ఆర్టీసీకి మహిళా సంక్రాంతి!
● వరంగల్ రీజియన్‌లో 12 రోజులకు వచ్చిన ఆదాయం రూ.30.30 కోట్లు
● అధిక సంఖ్యలో ప్రయాణించిన
మహిళలు
● ఈ నెల 9 నుంచి 20 వరకు రద్దీగా ఆర్టీసీ బస్సులు
● ఉచిత ప్రయాణంకంటే టికెట్ ప్రయాణ ఆదాయమే ఎక్కువ..
హన్మకొండ: సంక్రాంతి పండుగకు ఆర్టీసీలో మహిళ ప్రయాణికులే అధిక సంఖ్యలో ప్రయాణించారు. మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళా ప్రయాణికులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు. వరంగల్ రీజియన్‌లో ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు 48.64 లక్షల మంది ప్రయాణిస్తే ఇందులో మహిళా ప్రయాణికులు 30.40 లక్షల మంది ఉన్నారు. టికెట్ ద్వారా ప్రయాణించిన వారి సంఖ్య 18.25 లక్షలు మాత్రమే. ఇందులోనూ మహిళా ప్రయాణికులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో 62.5 శాతం మంది ఉచితంగా ప్రయాణించిన వారే. టికెట్ ద్వారా 37.5 శాతం మంది ప్రయాణించారు. సంక్రాంతి పండుగకు విద్యాసంస్థలకు ఈ నెల 11 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చారు. 18వ తేదీ ఒక్క రోజు పని దినం ఉన్నప్పటికీ 19వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 20వ తేదీ ఉదయం వరకు ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి నడిచాయి. విద్యాసంస్థలకు సెలవులు 11 నుంచి అయితే ఆర్టీసీ బస్సులకు ఈ నెల 9 నుంచి రద్దీ పెరిగింది.
రీజియన్‌లో 660 ప్రత్యేక బస్సులు
● సంక్రాంతి పండుగకు వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ 660 ప్రత్యేక బస్సులు నడిపింది.
● సంక్రాంతి పండుగకు 12 రోజుల్లో రూ.30,30,01,000 ఆదాయాన్ని రాబట్టుకుంది.
● సాధారణంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో రోజుకు సగటున రూ.2 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ 12 రోజుల్లో సగటున రూ.2.52 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కిలో మీటర్‌కు రూ.64.84 ఆర్జించింది.
● ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు 46.73 లక్షల కిలో మీటర్లు తిరిగి 48.64 లక్షల మందిని వివిధ గమ్యస్థానాలకు చేరవేసింది.
● మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ద్వారా 30.40 లక్షల మందిని చేరవేసింది. రూ.14,29,63,000 ఆదాయం వచ్చింది.
● టికెట్ ద్వారా 18.25 లక్షల మందిని చేరదీసి రూ.16,00,38,000 ఆదాయం రాబట్టుకుంది.
● మహిళా ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నా.. మొత్తం ఆదాయంలో ఉచిత ప్రయాణం ద్వారా 47శాతం మాత్రమే ఆదాయం వచ్చింది.
● టికెట్ ప్రయాణికుల ద్వారా 53 శాతం ఆదాయం వచ్చింది.
టికెట్ ఆదాయమే ఎక్కువ..
62.5 శాతం ఉచిత ప్రయాణికుల ద్వారా 47 శాతం ఆదాయం రాగా, 37.5 శాతం టికెట్ ప్రయాణికుల ద్వారా 53 శాతం ఆదాయం వచ్చింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులతో పోలిస్తే ఈ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉంటాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య అధికంగా కనిపించినా ఆదాయం ఆ మేరకు కనిపించలేదు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉంటున్నందున ప్రయాణికుల సంఖ్య తక్కువ కనిపించినా ఆదాయం అధికంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment