విద్యావ్యవస్థ బలోపేతానికి చర్చా వేదికలు
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, దీనిని బలోపేతం చేసేందుకు కమిషన్ జిల్లాల్లో చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. రాష్ట్ర సమగ్ర విద్యా విధానంపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల ప్రజలతో శుక్రవారం కలెక్టరేట్‌లో కమిషన్ చైర్మన్ చర్చా, సూచనలు, సలహాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ పనితీరుపై పక్క రాష్ట్రాలు, విదేశాల్లో కూడా పర్యటిస్తూ అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో పర్యటిస్తూ విద్యను ఏ విధంగా బలోపేతం చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ఒక పాలసీ అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. గద్వాల జిల్లా రాష్ట్రంలో వెనుకబడి ఉందని, తరువాత స్థానాల్లో భూపాలపల్లి, ములుగు జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయన్నారు. నాణ్యమైన విద్యా విధానం అమలుకు ఇచ్చే సలహాలు సూచనలు చాలా అమూల్యమైనవన్నారు. తద్వారా ఒక మంచి పాలసీ రూపకల్పనకు అవకాశం ఉంటుందన్నారు. చర్చ కొచ్చిన ప్రతీ అంశాన్ని నమోదు చేసుకొని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత పాలకులు చేసిన అరాచకాలతో పదేళ్లు విద్యా విధానం నాశనమైందని తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడారు. ఈ చర్చా వేదికలో కమిటీ సభ్యులు జ్యోత్స్నా, వెంకటేష్, విశ్వేశ్వర్‌రావు, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ డీఈఓ రాజేందర్, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, ఎస్సీ, బీసీ సంక్షేమ అధికారులు సునీత, శైలజ పాల్గొన్నారు.
● రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
Comments
Please login to add a commentAdd a comment