అపోహలు ప్రచారం చేయొద్దు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామంలోని అమరేశ్వరాలయం ఆవరణలోని హనుమాన్ విగ్రహానికి గురువారం సాయంత్రం మంటలు అంటుకున్న విషయంలో అపోహలు ప్రచారం చేయొద్దని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం మహదేవపూర్ సీఐ రామచంద్రరావు, ఎస్సై పవన్ కుమార్‌లతో వెళ్లి ప్రాథమికంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తులను, ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులను, ఆలయ పూజారిని విచారించారు. గురువారం కార్తీక మాసం సందర్భంగా కుజదోష పూజను నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భక్తులు హనుమాన్ విగ్రహానికి చందనం, నూనె పూసి తర్వాత ఎండు కుడుకలలో నూనె పోసి దీపం వెలిగించి హనుమాన్ విగ్రహం పాదాల వద్ద పెట్టి వెళ్లారు. ఆ తర్వాత పూజారి కూడా ఇంటికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు హనుమాన్ పాదాల వద్ద పెట్టిన కుడుకలోని దీపం అంటుకొని విగ్రహానికి గల చందనం, నూనెల వల్ల మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు అపోహలను ప్రచారం చేయొద్దని, నమ్మకూడదని ఆయన అన్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం నిమిత్తం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ నందనం కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అంబట్‌పల్లిలో ఆందోళన..
హనుమాన్ విగ్రహానికి మంటలు చెలరేగడంతో గ్రామానికి అరిష్టమని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు సమావేశమై ఏమి చేయాలని మాట్లాడారు. శాంతి సంప్రొక్షణ చేసి పునఃప్రతిష్టాపన చేయాలని చర్చించారు.
నేడు బంద్‌కు బజరంగ్‌దళ్ పిలుపు..
అంబట్‌పల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహం దగ్ధంపై బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మహదేవపూర్ మండల బంద్‌కు శనివారం పిలుపునిచ్చారు. కాకతీయుల కాలంనాటి దేవాలయంలో ఇప్పటికే పలుమార్లు హుండీలు ధ్వంసం చేశారని, ప్రస్తుతం నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపార, వాణిజ్య, విద్య, బ్యాంకు సంస్థలు బంద్‌ను పాటించాలని కోరారు.
కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి
విగ్రహ దగ్ధం ఘటనపై పోలీసుల ప్రాథమిక విచారణ
Comments
Please login to add a commentAdd a comment