ఇసుక సరఫరాకు అనుమతులు ఇవ్వాలి
భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 60 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరాకు ఇరిగేషన్ శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, విద్యుత్, మెగా ప్రాజెక్ట్ అధికారులతో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఇసుక రవాణా కోసం వే బిల్స్, ట్రాన్సిట్ ఫారాలు జారీ చేయాలని తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన డ్రై రన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే డేటా నమోదులో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న డేటా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డేటా భద్రత పాటించాలని తెలిపారు. ఏదేని సమాచారం బయటకి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సూపర్‌వైజర్లు పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నమోదుల తదుపరి ఎంపీడీఓ కార్యాలయాల్లో భద్రపరచాలని తెలిపారు. డేటా ఎంట్రీలో భద్రతా పాస్‌వర్డులను ఉపయోగించడం చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.
వేడుకలు ఘనంగా నిర్వహించాలి..
నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, అమృత్ సరోవర్‌ల వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, ఆర్డీఓ మంగీలాల్ పాల్గొన్నారు.
చిన్న కాళేశ్వరం పనులు వేగిరం చేయాలి
సర్వే డేటా నమోదులో పొరపాట్లకు తావివ్వొద్దు
ప్రజా పాలన–విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ
పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్‌లో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 54 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ మంగీలాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment