సాగు భారం..
భూపాలపల్లి రూరల్: రైతులకు సాగు భారంగా మారుతోంది. డీజిల్, ఎరువుల, విత్తనాల ధరలు, కూలీల రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. దీంతో సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పంట పెట్టుబడులు పెడుతూ.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి సాయం అందడంలేదు. పెరిగిన పంట పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ సాయం అంతంత మాత్రంగానే అందుతున్నా సాయం పూర్తి అవసరాలను తీర్చడం లేదు.
జిల్లాలో 1,05,000 ఎకరాల్లో వరి సాగు..
జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, గణపురం, భీంఘన్‌పూర్ సరస్సులతో పాటు జిల్లాలో 600లకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇవికాక బోర్లు, బావుల కింద సేద్యం చేస్తున్నారు. ఇలా నీటి వనరులు ఉండటంతో పాటు వర్షాలు సకాలంలో కురుస్తాయన్న ఆశతో ఏటా రైతులు వరి సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 1,05,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడితో పెట్టుబడి రాని వైనం చోటు చేసుకొంది.
పెట్టుబడులు.. మోయలేని భారం..
సీజన్ ప్రారంభంలో పొలాన్ని దున్నడం మొదలు పంట చేతికి వచ్చి మార్కెట్‌లో విక్రయించేదాక అన్నదాతలు పెట్టుబడులు పెట్టాల్సిందే. గ్రామాల్లో చాలామంది రైతులు యాంత్రీకరణపై ఆధారపడుతున్నారు. పొలం దున్నడం కోసం ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. గతేడాది పొలం దున్నడానికి ఎకరాకు రూ.4000 తీసుకుంటే ఈ ఏడాది రూ.6000 తీసుకున్నారు. పెరిగిన డీజిల్ ధరలు కారణమంటున్నారు. నాటువేసే కూలీలు ఎకరాకు రూ.5,500, వాహన ఖర్చులు అదనంగా తీసుకుంటున్నారు. మగ కూలీలకు గతంలో రోజువారి కూలి రూ.700 ఉంటే ఈ ఏడాది రూ.800 వరకు పెరిగింది. వరికోత మిషన్ ఆర్వేస్టర్‌కు గతేడాది అద్దె గంటకు రూ.1700 ఉంటే ఈఏడాది ఏకంగా రూ.2000 తీసుకుంటున్నారు. వీటితో పాటు విత్తనాలు ఎరువులకు పెరిగిన ధరలతో పోల్చుకుంటే నష్టాలే వస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
ఎకరా పొలం
దున్నేందుకు ట్రాక్టర్ ఖర్చు
ఏడాది ధర (రూ.లలో)
2021 3,500
2022 4,000
2023 5,000
2024 6,000
పెరుగుతున్న పెట్టుబడులు
డీజిల్ ధరల పెరుగుదలతో ట్రాక్టర్లు, వరికోత యంత్రాల కిరాయిలు పెంపు
సన్నాల సాగుతో తగ్గిన ధాన్యం దిగుబడి
ఆందోళనలో రైతులు
ఎరువుల ధరలు బస్తాకు (రూ..)
ఎరువు రకం గతేడాది ఈఏడాది
20:20:013 1,225 1,350
28:28:0 1,550 1,750
డీఏపీ 1,250 1,450
పొటాస్ 1,700 1,700
అమ్మోనియం 1,050 1,050
యూరియా 300 300
ఖర్చులు బాగా పెరిగాయి..
ఏటా వరిసాగుకు ఎకరాకు ఖర్చు రూ.20వేల లోపు అయ్యేది. ఈ ఏడాది మాత్రం 25 వేలకు పైగా అయింది. నాటు, కూలీలు, ట్రాక్టర్ల ఖర్చుతో భారం పెరుగుతోంది. ఈ ఏడాది రైతులు ఎక్కువ శాతం సన్నాలు సాగు చేశాం. సన్నాలకు పొట్ట దశలో తెగుళ్లు వ్యాపించడంతో మందుల ఖర్చు పెరిగింది ఈసారి దిగుబడి తగ్గేటట్లు ఉంది.
– కానుగంటి సతీష్, రైతు, కొత్తపల్లి (ఎస్‌ఎం) భూపాలపల్లి
Comments
Please login to add a commentAdd a comment