ఎన్నాళ్లు ఈ నిరీక్షణ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ ఓపెన్ కాస్ట్–2 ప్రాజెక్ట్‌లో భూములు, ఇళ్లు కోల్పోతున్న భూ నిర్వాసితులు ఏళ్ల తరబడి నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓసీ–2 సమీపంలో గడ్డిగానిపల్లి గ్రామంతో పాటు వ్యవసాయ భూములను తీసుకునేందుకు సింగరేణి యాజమాన్యం భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి ఇందుకు కావాల్సిన డబ్బులను కూడా సింగరేణి యాజమాన్యం విడుదల చేసి ఆర్డీఓ ఖాతాలో జమచేసింది. నష్టపరిహారం చెల్లించి ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. భూ నిర్వాసితులు ఏళ్ల తరబడి సింగరేణి, రెవెన్యూ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో గురువారం నుంచి బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులను అడ్డుకుంటున్నారు. అక్కడే టెంటు వేసుకుని నిరసన చేపడుతున్నారు.
2016లో భూసేకరణ
ఓపెన్ కాస్ట్–2 విస్తరణలో భాగంగా 2016–17 సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం గడ్డిగానిపల్లి గ్రామంతో పాటు సమీపంలో వ్యవసాయ భూములను తీసుకునేందుకు సింగరేణి యాజమాన్యం ముందుకు వచ్చి రెవెన్యూ అధికారుల సహాయంతో భూసేకరణ చేపట్టింది. ఇళ్లను రెవెన్యూ అధికారులు వందల సంఖ్యలో సర్వేలు చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పబ్లిక్ నోటిఫికేఫన్ విడుదల చేశారు. ఇంటి విస్తీర్ణం, ఇంటి వివరాల కాపీలను అందజేశారు. అవార్డు జారీచేసి పరిహారం మాత్రం ఇవ్వడం లేదు. నాటినుంచి గ్రామంలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదు. గ్రామంలోని 550 నివాస గృహాలు భూస్థాపితం కానున్నాయి.
ఓపెన్ కాస్ట్–2 భూ నిర్వాసితులకు అందని సాయం
గడ్డిగానిపల్లి భూ నిర్వాసితుల ఆందోళన
పబ్లిక్ నోటిఫికేఫన్ విడుదల చేసి ఏడాది
అవార్డు జారీచేయకుండా
అధికారుల నిర్లక్ష్యం
బొగ్గు ఉత్పత్తిని అడ్డుకుంటున్న గ్రామస్తులు
పరిహారం ఇవ్వడంలో ఆలస్యం..
వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోతున్న భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో అధికారులు మల్లగుళ్లాలు పడుతున్నారు. ఎనిమిదేళ్ల నుంచి కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు, సింగరేణి అధికారులు అనేకమంది బదిలీ అయ్యారు. ఒక్కో కలెక్టర్, అధికారి పరిహారం చెల్లింపు ఒక్కో విధంగా విధివిధానాలు మారుస్తుండడం భూనిర్వాసితులకు ఇబ్బందిగా మారింది. 2017వ సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం ప్రాథమిక అంచనాతో 550 ఇళ్లకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటు కోసం సింగరేణి యాజమాన్యం రెవెన్యూ శాఖకు రూ.110 కోట్ల నిధులను అప్పగిస్తూ బ్యాంకు ఖాతాలో జమచేసింది.
Comments
Please login to add a commentAdd a comment