కోర్టు తీర్పుపై హర్షం
భూపాలపల్లి రూరల్: రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును రైతు స్వరాజ్య వేదిక జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేస్తుందని ఆ సంఘం జిల్లా కన్వీనర్ కర్నాటకపు సమ్మయ్య తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.9.98కోట్ల పరిహారం విడుదల చేసిందన్నారు. ఇది రైతుల విజయమన్నారు. ఈ సమావేశంలో యాస నర్సయ్య పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీటీ గణిత శాస్త్రం (జనరల్) కేటగిరి ఒక పోస్టుకు బీఎస్సీ మ్యాథ్స్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 99892 72091 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి పేర్కొన్నారు.
ఆకునూరి మురళికి వినతి
భూపాలపల్లి అర్బన్: ఎన్‌ఈపీ అమలు, గుణాత్మక విద్యలో భాగంగా పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేసినట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆరే రాకేష్‌రెడ్డి, వెలిసోజు బుచ్చిరాములు తెలిపారు. ప్రీ ప్రైమరీ విధానాన్ని అమలు చేయాలని, ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలని, ఇంగ్లిష్ సబ్జెక్టును ప్రాధాన్యత గల సబ్జెక్టుగా భావిస్తూ 4, 5వ తరగతులకు పుస్తకాలు తగ్గించాలని, ఆడియో విజువల్ లర్నింగ్‌కు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి పాఠశాలల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.
పరిహారం అందించాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టనున్న కాల్వ నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని ఆదివారంపేట, గుమ్మాళ్లపల్లి గ్రామాల రైతులు అధికారులను మంగళవారం అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయా గ్రామాల్లోని చెరువుల్లోకి నీరు నింపేందుకు కాల్వల నిర్మాణం కోసం అధికారులు సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు సర్వేను అడ్డుకోవడానికి వెళ్లగా ముందస్తుగా పోలీసులు చేరుకొని వారిని నిలువరించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలపడంతో రైతులు అధికారులతో మాట్లాడి తమ సమస్యను విన్నవించారు. గతంలో పైప్‌లైన్‌లో భాగంగా కోల్పోయిన భూములకు ఇప్పటివరకు పరిహారం అందలేదని తెలిపారు. పరిహారం అందించిన తర్వాతనే సర్వే, నిర్మాణ పనులు కొనసాగించాలని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని సర్వే అధికారులు రైతులకు నచ్చజెప్పారు. సర్వేలో డీఐ గంగాధర్, సర్వేయర్ వినయ్, ఏఈఈ పాల్గొన్నారు.
రామప్ప టెంపుల్ బాగుంది
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని, ఇలాంటి శిల్పాలను మరెక్కడ చూడలేదని ఫ్రాన్స్ దేశస్తులు హెరిక్, స్టీవెన్‌లు, అమెరికాకు చెందిన టీన్ కొనియాడారు. రామప్ప ఆలయాన్ని వారు వేర్వేరుగా మంగళవారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. వారికి గైడ్‌లు వెంకటేశ్, విజయ్‌కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించారు. రామప్ప శిల్పాల వద్ద ఫొటోలు దిగుతూ ఆలయ అందాలను తమ సెల్‌ఫోన్‌లలో బంధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment