పురిటినొప్పులతో పరీక్షలకు హాజరయ్యా..
ధరూరు: ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని క్రమశిక్షణతో చదవడం అలవర్చుకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని.. తాను పురిటి నొప్పుల బాధతో కూడా పరీక్షలకు హాజరయ్యానని, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి గంటా కవితా దేవి అన్నారు. శుక్రవారం మండలంలోని ఉప్పేరు ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ.. నేను కూడా మీలాగే ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని చదవడం అలవర్చుకుంటే దానిని చేరుకోవచ్చని అన్నారు. మీరు కూడా ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని చదివితే వాటిని పొందడం పెద్ద కష్టమేమి కాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అందుతుందని అన్నారు. అలాగే బాల్య వివాహాలకు తావు లేకుండా చూడాలని, చదువుతోనే సమాజంలో సంస్కారం, గౌరవం లభిస్తాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆది మల్లారెడ్డి, రాజేందర్, లక్ష్మణస్వామి, హెచ్‌ఎం గౌరీశంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్య సాధనకు
సరైన ఆయుధం
విద్య మాత్రమే.. :
జడ్జి కవితాదేవి
Comments
Please login to add a commentAdd a comment