ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
గద్వాల అర్బన్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్మృతివనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా ప్రజల ప్రజాస్వామిక హక్కులను పరిరక్షిస్తామని చెప్పారని, కానీ నేడు రాష్ట్రంలో హక్కులను హరిస్తున్నారన్నారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, పోడుభూములకు పట్టాలు, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1500, ధరణి పోర్టల్ ప్రక్షాళన, ఉద్యమకారులకు 250గజాల స్ధలం, వృద్దులు, వితంతులకు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నాయకులు హలీం పాష, వెంకటేష్, జమ్మిచేడు కార్తీక్, మధు తదితరులు ఉన్నారు.
ఉత్సాహంగా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షుడు అమరేందర్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి శరత్‌చంద్ర మాట్లాడుతూ జిల్లాస్థాయి ఎంపికల్లో జిల్లావ్యాప్తంగా దాదాపు 250 మంది బాల, బాలికలు హాజరయ్యారన్నారు. మంచిర్యాలలో వచ్చేనెల 1న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయన్నారు. జట్టు తుది జాబితాను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. కోచ్‌లు ఆనంద్‌కుమార్, సాధిక్‌అలీ, సునీల్‌కుమార్, కె.రమేశ్‌బాబుపాల్గొన్నారు.
అథ్లెటిక్స్ క్రీడాంశాలు
జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో అండర్– 8లోపు విభాగం బాల, బాలికలకు 50 మీ., 300 మీటర్ల పరుగు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, అండర్– 10లోపు విభాగంలో 100 మీ., 300 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, అండర్– 12 విభాగంలో 100 మీ., 400 మీ., 600 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ అంశాల్లో ఎంపికలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment