నేడు తలుపులమ్మ తల్లి జాగరణోత్సవం | Sakshi
Sakshi News home page

నేడు తలుపులమ్మ తల్లి జాగరణోత్సవం

Published Tue, May 7 2024 11:35 AM

నేడు తలుపులమ్మ తల్లి జాగరణోత్సవం

తుని రూరల్‌: గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవకొత్తూరు గ్రామంలో తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు మంగళ, బుధవారాల్లో నిర్వహించనున్నారు. దీనికి లోవ దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. గంధామావాస్యకు లోవ కొత్తూరులో అమ్మవారి పుట్టింటి సంబరాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి లోవ కొత్తూరులోని నాలుగెకరాల స్థలంలో అమ్మవారి ఆలయం వద్ద జాగరణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శక్తి వేషాలు, గరగోత్సవం, కేరళ బృందం బటర్‌ ఫ్లై డ్యాన్స్‌, గోపాల గోపాల స్టేజ్‌ ప్రోగ్రాం, రాజు భాయ్‌ ఈవెంట్స్‌, నక్కపల్లి వారి బ్యాండ్‌ మేళం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు సోమవారం తెలిపారు. బుధవారం సాయంత్రం తీర్థం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు, కళాకారులచే బళ్లవేషాలు, బుల్లితెర కళాకారుల స్టేజ్‌ ప్రోగ్రాం, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు. అమ్మవారిని భక్తులు దర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. జాతరను పురస్కరించుకుని గ్రామాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. బుధవారం వి.కొత్తూరు, తాళ్లూరు, కుమ్మరిలోవ, జగన్నాథగిరి, సీతయ్యపేట, కొత్త వెలంపేట, రాజుపేట, వెలంపేట కాలనీ తదితర గ్రామాల్లో కూడా తలుపులమ్మ అమ్మవారి ఉత్సవం నిర్వహించనున్నారు.

 
Advertisement
 
Advertisement