రత్నగిరి.. భక్తసిరి●
● సత్యదేవుని దర్శించిన 80 వేల మంది
● రికార్డు స్థాయిలో 8,358 వ్రతాల నిర్వహణ
● రూ.80 లక్షల ఆదాయం
అన్నవరం : రత్నగిరి భక్తజనఝరిగా మారిపోయింది. కార్తిక సోమవారం, శుద్ధ దశమి, సాయంత్రం నుంచి ఏకాదశి తిథులు కలసి రావడంతో సత్యదేవుని వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రికే సుమారు 30 వేల మంది భక్తులు రత్నగిరికి చేరుకున్నారు. దీంతో స్వామివారి ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకు తెరచి వ్రతాలు ప్రారంభించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ రద్దీ కొనసాగింది. స్వామివారి వ్రత, నిత్య కల్యాణ, పాత కల్యాణ మండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. రికార్డు స్థాయిలో సుమారు 80 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. కార్తిక మాసం ప్రారంభమయ్యాక గడచిన 11 రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో భక్తులు రావడం ఇదే ప్రథమం. ఈ పవిత్ర మాసంలో సోమవారం ఒక్క రోజే అత్యధికంగా 8,358 సత్యదేవుని వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఇందులో వ్రతాల ద్వారానే సుమారు రూ.50 లక్షలు రాగా, మిగిలిన విభాగాల ద్వారా రూ. 30 లక్షలు వచ్చింది.
దీపకాంతుల్లో..
స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో, రావిచెట్టు వద్ద, ధ్వజస్తంభం వద్ద జ్యోతులు వెలిగించి, దీపారాధన చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో నిండిపోయింది. భక్తుల వాహనాలతో దేవస్థానం ఘాట్ రోడ్లు, మల్టీ లెవెల్ పార్కింగ్ స్థలాలు కూడా నిండిపోయాయి. పశ్చిమ రాజగోపురం లోపల రోప్ అడ్డుగా కట్టి భక్తులను నియంత్రించారు. ఇక్కడ నాలుగు వ్రత మండపాలున్నాయి. వ్రతాలు పూర్తయ్యాక ఈ మండపాల నుంచి భక్తులు ఒక్కసారిగా వెలుపలకు వస్తారు. అదే సమయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు కూడా వెలుపలకు వచ్చే అవకాశం ఉండడంతో చాలా రద్దీ ఉంటుంది. దీనిని రోప్ నియంత్రించారు. ఇకపై కార్తిక పౌర్ణమి, శని, ఆది, సోమవారాల్లో కూడా ఇదేవిధంగా భక్తులను నియంత్రించాలని దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్ ఆదేశించారు. దేవస్థానంలో ఏర్పాట్లను ఆయన నేరుగా పర్యవేక్షించారు. సుమారు 15 వేల మంది భక్తులకు ఉచితంగా పులిహోర, దద్ధోజనం, చిన్న పిల్లలకు పాలు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment