తొగరి కాయ కోసం వెళ్లి మృత్యు ఒడికి..
బిచ్కుంద: చేనులో కాసిన తొగరి కాయ కోసం వెళ్లిన ఇద్దరి యువకులను మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదంలో వారిని కాటేసి ఇరు కుటుంబాల్లో తీరని శోఖాన్ని మిగిల్చింది. బిచ్కుంద మండలంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు మృతి చెందారు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం పెద్దతక్కడ్‌పల్లి గ్రామానికి చెందిన మేకల కార్తిక్(25), మేకల వంశి(20) అనే ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన చిన్ననాన్న, పెద్దనాన్న అన్నాదమ్ముళ్లు. కార్తిక్‌కు 9 నెలల క్రితం వివాహం కాగా భార్య గర్భిణిగా ఉంది. తనకున్న వ్యవసాయ భూములను కౌలుకు ఇచ్చి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పిట్లంలో ఇటీవల బంధువుల పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు. మేకల వంశీ కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామంలోనే వ్యవసాయ పనులు చేస్తున్నాడు. కార్తిక్, వంశీ గురువారం సాయంత్రం తమ పొలానికి కాసిన తొగరిని తెంపేందుకు బైక్‌పై చేనుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా కౌలాస్‌గేట్ ప్రాంతంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. ఈ ఘటనలో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ నరేశ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు జుక్కల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
పొలానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
రెండు కుటుంబాల్లో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment