● రేషన్ బియ్యంతో కోళ్ల దాణా.. బీర్ల తయారీ
● అక్రమ ఆదాయానికి ఏడు మార్గాలు
● కిరాణా దుకాణాలే నిల్వకేంద్రాలు
● అనువైన సమయాల్లో రవాణా
రేషన్‌బియ్యం దందాకు చెక్ పడడం లేదు. రూపం మారిన దందా దళారులకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వం ఈ–పాస్ వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నా అక్రమార్గాన రేషన్‌బియ్యం తరలిపోతూనే ఉంది. టిఫిన్ సెంటర్లు.. కోళ్లదాణా.. బీర్ల తయారీ.. అధిక ఆదాయం అందించే మహారాష్ట్రకు రవాణా.. ఇలా రూపం మారిందే తప్ప దందా ఆగలేదు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పేదల కడపు నింపాల్సిన బియ్యం దళారులు, మిల్లర్లకు కాసులవర్షం కురిపిస్తోంది.
కరీంనగర్ అర్బన్: జిల్లాలో రేషన్‌బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. బియ్యం దందా రూపం మార్చుకొని విచ్చలవిడిగా సాగుతోంది. పేదల కడుపు నింపాల్సిన రేషన్‌బియ్యం కోళ్లకు ఆహారంగా.. బీర్ల తయారీకి వనరుగా వినియోగిస్తున్నారు. రేషన్‌బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ వ్యాపారికి అడ్డుకట్ట పడడం లేదు. అధికారుల ఉదాసీన వైఖరి, మామూళ్ల మాటున మళ్లీ అక్రమదందా వేళ్లూనుకుంటోంది. పలువురు రేషన్‌డీలర్లు కార్డుదారుల వేలిముద్రలు తీసుకొని బియ్యం ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో రికార్డు చేస్తున్నారు. అయితే ఆ బియ్యాన్ని వారే కొని దళారులకు నేరుగా విక్రయిస్తున్నారు.
కిరాణా, రేషన్ దుకాణాలే అడ్డాలు
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి కుగ్రామం వరకు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం విరాజిల్లుతోంది. రేషన్‌దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్(సీబీ) చూపించే వరకు బియ్యం నిల్వ చేసుకునే అవకాశముండగా సీబీలోపు పక్కదారి పట్టిస్తున్నారు. వేలిముద్ర వేసి వెళ్లిన వారి బియ్యానికి ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేసుకుని లెక్కలు వేసుకున్న తర్వాత దళారులు, మిల్లర్లకు అంటగడుతున్నారు. కిరాణ దుకాణ నిర్వాహకులు కూడా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా అనుకూల సమయాల్లో దళారులకు విక్రయిస్తున్నారు. మొత్తంగా దందా యథేచ్ఛగా సాగుతోంది.
పట్టుబడిన రేషన్ బియ్యం
అక్రమ ఆదాయానికి ఏడు మార్గాలు
● ప్రతీ వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎమ్మార్ కొనసాగడం పరిపాటి. ఇదే సమయంలో పలువురు మిల్లర్లు దళారులను ఏర్పాటు చేసుకుని రేషన్‌బియ్యాన్ని కొని సీఎమ్మార్‌గా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. అధికారులు తనిఖీలకొస్తే తమకున్న పలుకుబడితో బయటకు పొక్కకుండా మేనేజ్ చేస్తున్నారు.
● ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం మరా ఆడించి ఇతర మార్గాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
● టిఫిన్‌సెంటర్లకు రేషన్ బియ్యం తరలిపోతోంది. తక్కువ ధరకు బియ్యం లభిస్తుండడంతో టిఫిన్ సెంటర్ నిర్వాహకులు సైతం కొంటున్నారు. దోశ, ఇడ్లి, వడ ఇతర తినుబండారాల్లో కలిపేస్తుండగా పలువురు నిర్వాహకులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడిస్తున్నారు.
● కోళ్ల ఫారాలలో దాణాకు ఉపయోగిస్తున్నారు. మానకొండూర్ మండలం లక్ష్మీపూర్‌లో వంద క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యం పట్టుబడటం ఇందుకు నిదర్శనం. మక్కల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది కోళ్ల ఫారం నిర్వాహకులు తక్కువ ధరకు వస్తున్న లభిస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసి కోళ్లకు దాణాగా వాడుతున్నారు.
● బీర్లు తయారీ చేసే పరిశ్రమలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. గతంలో పట్టుబడిన కేసుల్లో 20కి పైగా ఇలాంటి రవాణావేనని పౌరసరఫరాల శాఖలోని ఓ అధికారి వివరించారు.
● సన్నరకాల దిగుబడి తక్కువగా ఉండడంతో సన్నబియ్యం ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక పలువురు వ్యాపారులు రేషన్ బియ్యాన్నే పాలిష్ చేసి సన్నరకాల్లో కలిపి విక్రయిస్తున్నారు.
● అత్యధిక లాభాలు గడించే మార్గం మహారాష్ట్రకు తరలించడం. మహారాష్ట్ర ప్రజలు దొడ్డుబియ్యాన్ని అమితంగా ఇష్టపడతారు. అక్కడ కిలో రూ.26–30 వరకు ధర పలుకుతుండటంతో భారీగా ఆదాయం గడిస్తున్నారు.
న్యూస్‌రీల్
దళారులు పుట్టుకొస్తున్నారు
చోటమోటా బియ్యం డాన్‌లతోపాటు భారీ డాన్‌ల సంఖ్య పెరుగుతుందే తప్పా తగ్గకపోవడం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం. ఇతరుల పేర్లతో దందా చేస్తూ కేసులు నమోదయ్యే సమయంలో అన్నీతామై వ్యవహరిస్తున్నారు. దీనికి కొందరు అధికారుల అండ పుష్కలంగా ఉండటం విశేషం. దందా చేసే అక్రమార్కులపై పదుల సంఖ్యలో కేసులున్నప్పటికీ కఠిన శిక్షలు లేకపోవడంతో మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. పలువురి అధికారులతో ఉన్న మామూళ్ల బంధంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్టు అమలు చేయాలని స్పష్టంగా నిర్ధేశించినా ఆమేరకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 6ఏ కేసులతోనే సరిపుచ్చుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయడంలో అధికారుల తీరును ప్రశంసించాల్సిందే కానీ పూర్తిస్థాయిలో చర్యలకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాగా రేషన్‌బియ్యం పక్కదారి పట్టించేవారెవరైన వదిలేదిలేదని పౌరసరఫరాల ఽశాఖ, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment