సంబరంగా హంపీ ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

సంబరంగా హంపీ ఉత్సవం

Published Sun, Feb 4 2024 1:10 AM | Last Updated on Sun, Feb 4 2024 1:10 AM

- - Sakshi

సాక్షి బళ్లారి: విజయనగర రాజుల కాలంలోని శ్రీకృష్ణదేవరాయల పాలనలో హంపీ ఖ్యాతి దశదిశలా ఇనుమడింప చేయడంతో, గత స్మృతులను నేటి తరానికి గుర్తు ఉండేలా హంపీ ఉత్సవాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి హంపీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా పర్యాటకులకు కనువిందు చేసేలా సాంస్కృతిక వైభవం కనిపించింది. హంపీ ఉత్సవాల్లో పురాతన కాలం నాటి పద్ధతులను, వస్తువులను నేటి తరానికి చూపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు యువతను ఎంతో ఆకట్టుకున్నాయి. ఫల, పుష్పప్రదర్శనలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, పురాతన ఆహార పద్ధతులు, నాణేల వాడుక నుంచి ఎన్నో పాత తరం గుర్తులను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తూ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.

గుర్తుకు వస్తున్న పురాతన పద్ధతులు

ఉత్సవాలతో పాటు మన సంస్కృతి వారసత్వాలు, పురాతన పద్దతులు, సేంద్రియ వ్యవసాయం, బోర్లు లేని రోజుల్లో, కరెంటు లేని రోజుల్లో వ్యవసాయాన్ని కపిల పద్ధతి ద్వారా బావి నుంచి నీటిని ఎద్దులతో ఏ విధంగా కాలువలకు నీటిని తోడే పద్ధతిని ఇలా చెప్పుకుంటూ పోతే హంపీ ఉత్సవాలు ఒక రకంగా ఎంతో విజ్ఞానాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శింపజేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ క్రీడలు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. శనివారం హంపీ ఉత్సవాల్లో రెండో రోజు జరిగిన కుస్తీ పోటీలు పర్యాటకులకు ఎంతోనో ఉత్సాహాన్ని నింపాయి. గాయత్రీ పీఠ వేదిక, ఎదురు బసవణ్ణ వేదిక, సాసివెకాళు గణపతి వేదిక, విరుపాక్షేశ్వర దేవస్థాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

జనసాగరంగా హంపీ ఉత్సవాలు

హొసపేటె: ఉత్సవాల సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో హంపీ ఉత్సవాల వీక్షణకు రెండో రోజు శనివారం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో హంపీలో ఉత్సవ శోభ సంతరించుకొంది. ప్రజలు హంపీలో ఏర్పాటు చేసిన సిరిధాన్య, ఫలపుష్ప, పుస్తక, వ్యవసాయ ప్రదర్శనలను తిలకించారు. హంపీలోని విరుపాక్ష ఆలయ రథవీధి ప్రజలతో నిండిపోయింది.

ఘనంగా మహిళా గోష్టి

హంపీ ఉత్సవాల్లో భాగంగా శనివారం హంపీలోని విరుపాక్షేశ్వర వేదికపై మహిళా గోష్టి జరిగింది. మరియమ్మనహళ్లిలోని రాష్ట్ర అవార్డు గ్రహీత రంగస్థల కళాకారుడు డాక్టర్‌ కే.నాగరత్నమ్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ నాటకరంగంలో తన జీవితకాల సాఫల్యానికిగాను గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం గర్వంగా ఉందన్నారు. బెళగావి జిల్లా వయోజన విద్యాశాఖాధికారి డాక్టర్‌ ఏఎం.జయశ్రీ, రచయిత్రి సుధా చిదానందగౌడ పాల్గొన్నారు.

అలరించిన గీతాలాపన

హంపీ ఉత్సవాల్లో వివిధ వేదికలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకొన్నాయి. ప్రధాన వేదిక గాయత్రి పీఠం వేదిక వద్ద నిర్వహించిన ప్రఖ్యాత కన్నడ సినీగాయకుడు విజయ్‌ప్రకాష్‌ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన రసమంజరి తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఉత్సవాలకు పోటెత్తుతున్న జనం

సాంస్కృతిక కార్యక్రమాలు భళా

స్ఫురిస్తున్న పురాతన గత వైభవం

మైమరిచిపోతున్న పర్యాటకులు

ఉదయం అంతా కట్టడాల వీక్షణ

రాత్రికి సాంస్కృతిక ప్రదర్శనలు

No comments yet. Be the first to comment!
Add a comment
హంపీ ఉత్సవాల్లో ప్రదర్శించిన విభిన్న సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు 1
1/2

హంపీ ఉత్సవాల్లో ప్రదర్శించిన విభిన్న సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement