ఏనుగుల బెడద నియంత్రణకు కొత్త పథకం
శివమొగ్గ: శివమొగ్గ, హాసన, చిక్కమగళూరు జిల్లాల్లో అడవి ఏనుగుల బెడద నియంత్రణకు కొత్త పథకాన్ని అమలు చేస్తున్నామని, ఆ ప్రకారం భద్రా అభయారణ్యంలో ఏనుగుల శిబిరాన్ని స్థాపిస్తామని అటవీ శాఖా మంత్రి బీ.ఈశ్వర్ ఖండ్రె ప్రకటించారు. జిల్లాలోని శంకరఘట్టలోని కువెంపు విశ్వవిద్యాలయ సభాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పులుల సంరక్షిత ప్రదేశ రజత మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏనుగుల నుంచి ఎక్కువగా ప్రాణహాని, పంట నష్టం వాటిల్లుతోందన్నారు. దీనిని నివారించేందుకు 2 వేల హెక్టార్లలో ఏనుగుల విహారధామాన్ని ఏర్పాటు చేసి ఏనుగులకు ఇష్టమైన వెదురు, గడ్డి పెంచుతామన్నారు. చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బంధించిన ఏనుగులను ఇక్కడకు తెచ్చి వదులుతారన్నారు. భద్రా పులి అభయారణ్యం వెయ్యి చదరపు కిలోమీటర్ల వ్యాప్తిలో విశాలమైన సుభద్ర అడవిగా ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 563 పులులున్నాయని, పులుల సంఖ్యలో దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. పతనావస్థలో ఉన్న పులుల సంతతిని సంరక్షించేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1973లో ప్రారంభించిన పులుల పథకానికి 50 ఏళ్లు పూర్తి కావడం గర్వకారణమన్నారు.
40 పులుల కేంద్రం
భద్రా అరణ్య వాసుల పునర్వసతి అనంతరం మానవులు, వన్యజీవుల సంఘర్షణ గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ప్రారంభంలో 8 పులులను కలిగిన ఈ సురక్షిత ప్రాంతంలో ప్రస్తుతం 40 పులులు ఉన్నాయన్నారు. ఇక్కడ దట్టమైన అడవులుండటంతో సుమారు 400కు పైగా ఏనుగులున్నాయన్నారు. ఈసందర్భంగా మంత్రి భద్రా రజత మహోత్సవం స్మరణార్థం తపాలా బిళ్ల, ఇంటర్నెట్ సైట్, బ్రోచర్‌లను ఆవిష్కరించారు.
మంత్రి ఈశ్వర్ ఖండ్రె
Comments
Please login to add a commentAdd a comment