అన్ని ముడా స్థలాలు వెనక్కి
మైసూరు: ముడా (మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార)లో 50:50 నిష్పత్తిలో పంపిణీ చేసిన అన్ని స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని గురువారం ముడా కార్యాలయంలో అధ్యక్షుడు, జిల్లాధికారి లక్ష్మికాంతరెడ్డి అధ్యక్షతన జరిగిన సామాన్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి పీఎన్ దేశాయి ఏకసభ్య విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో 2020 నుంచి ముడా ఇళ్ల స్థలాలను పొందినవారు, వాటిని కొనుగోలు చేసిన వేలాది మందికి గట్టి షాక్ తగిలింది. తద్వారా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు చట్టపరంగా ఇబ్బందులు సృష్టిస్తున్న ఆ స్థలాల పంపిణీ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, ముడా సభ్యులు టీఎస్ శ్రీవత్స, హరీష్‌గౌడ, జీటీ దేవెగౌడ, ఎమ్మెల్సీలు విశ్వనాథ్, మంజేగౌడ, వివేకానంద, ముడా కమిషనర్ రఘునందన్, పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, పాలికె కమిషనర్ అసాద్ ఉర్ రెహమాన్ సహా సీనియర్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. ముడా నిర్ణయంతో వేలాది మంది నష్టపోయే అవకాశం ఉంది. దీంతో వారు కోర్టును ఆశ్రయించవచ్చని తెలుస్తోంది. చివరకు ముడా వ్యవహారం మైసూరులో పెద్ద సమస్య అయి కూర్చుందని పలువురు నిట్టూర్చారు.
మాజీ కమిషనర్‌పై ఫిర్యాదు
ముడా కేసులో నిందితుడైన మాజీ కమిషనర్ జీ.టీ.దినేష్ కుమార్ కువెంపునగరలోని అధికారిక నివాసంలోని డీవీఆర్, 2 సీసీ టీవీ కెమెరాలు అదృశ్యంపై తాజాగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కమిషనర్‌గా ఉండగా ముడాలో రూ.5 వేల కోట్ల విలువ చేసే స్థలాల పంపిణీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి 14 స్థలాలను అక్రమంగా మంజూరు చేశారనే అభియోగముంది. ఈ ఇంటి నుంచే కార్యకలాపాలు జరిగాయని, కేసు బయటకు రాగానే ఆ ఇంటి సీసీ టీవీ కెమెరాలు, రికార్డర్లు మాయమైనట్లు ఆరోపణలు వినిపించాయి. ఇదేమిటో తేల్చాలని ముడా అధికారులు కువెంపునగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
2020 నుంచి వర్తింపు
జిల్లాధికారి, సభ్యుల తీర్మానం
వేలాది మందికి ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment