ఆన్‌లైన్ నిర్బంధం.. రూ.1.23 కోట్ల లూటీ
● హుబ్లీలో సైబర్ క్రైం
హుబ్లీ: సీబీఐ అధికారులని వాట్సాప్ కాల్ చేసి విశ్రాంత వైద్యాధికారి మోహన్‌రాజ కోరిశెట్టి నుంచి రూ.1.23 కోట్ల మేర ఆన్‌లైన్ కేటుగాళ్లు బదలాయించుకొన్నారు. వివరాలు.. ఇటీవల బాధితునికి వాట్సాప్‌లో కాల్ చేశారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి చట్ట వ్యతిరేక వ్యవహారాలు జరిగాయని, ముంబై కోర్టులో మీ పై మనీ లాండరింగ్ కేసు దాఖలైంది. అరెస్టుకు వారెంట్ జారీ అయ్యింది. మిమ్మల్ని త్వరలోనే అరెస్ట్ చేయవచ్చునని బెదిరించారు. నిజమేననుకుని కోరిశెట్టి హడలిపోయారు. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ లేకుండా చేయడానికి, అలాగే కేసును దర్యాప్తు చేయడానికి మేము చెప్పిన ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఒత్తిడి చేశారు. దీనిపై ఎవరితో చర్చించరాదని, వీడియో కాల్‌లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితిలోను కాల్ కట్ చేయరాదని హెచ్చరించారు. తరువాత ఆయన చేత తమ ఖాతాల్లోకి 1.23 కోట్లను బదలాయించుకున్నారు. తరువాత ఇదంతా మోసగాళ్ల పని అని తెలిసి కోరిశెట్టి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లీపిల్లల ప్రాణాలకు భద్రత లేదా?
శివాజీనగర: రాష్ట్రంలో బాలింతల మరణాల కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తీవ్రతను తెలుసుకొని ఉన్నత స్థాయి తనిఖీ చేపట్టాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. బెళగావి శీతాకాల సమావేశాల తరువాత కూడా మరణాలు ఆగడం లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఎక్స్‌లో ఆరోపించారు. పేద కుటుంబాల తల్లుల ప్రాణాలకు కాంగ్రెస్ సర్కారులో భద్రత లేదు. బెళగావి జిల్లాలో గత 6 నెలల్లో 29 మంది బాలింతలు, ఒక సంవత్సరంలో 322 నవజాత శిశువులు చనిపోయారు. ఈ మరణాలకు కారణాన్ని కనిపెట్టి పేద కుటుంబాల తల్లుల ప్రాణాలను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
కంపెనీకి రూ. 86 లక్షలు బురిడీ
బనశంకరి: ప్రైవేటు కంపెనీ ఈ–మెయిల్‌ని హ్యాక్‌చేసి వారి పేరుతో రూ.86.56 లక్షలు విలువచేసే ఈ–గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలు.. నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీ ఈమెయిల్‌ని అక్టోబరు 22 తేదీన గుర్తుతెలియని వ్యక్తి హ్యాక్ చేసి, ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించాడు. ఆ సమాచారం ఆధారంగా రూ. 86.56 లక్షల ఈ –గిఫ్ట్ కార్డులను పలు వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేసి సొమ్ము చేసుకున్నారు. తమ ఖాతాల నుంచి నగదు కట్‌అయినట్లు సమాచారం అందగానే కంపెనీ అధికారులు కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులపై కుమార విమర్శలు
దొడ్డబళ్లాపురం: కర్ణాటక పోలీసులంటే దేశంలో ఎంతో గౌరవం ఉందని, అయితే ఇటీవల కొందరు పోలీసులు ఆ పరువును, గౌరవాన్ని మంటగలుపుతున్నారని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. హాసన్ జిల్లా హొళేనరసీపుర తాలూకా హరదనహళ్లిలో ఎమ్మెల్సీ సీటీ రవి కేసు గురించి మాట్లాడుతూ, కొందరు మంత్రులు పోలీసులను ఆటబొమ్మలుగా చేసుకుని వారి ద్వారా నిబంధనలకు విరుద్ధంగా పని చేయిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలలో నచ్చనివారిపై కేసులు పెట్టిస్తున్నారని అన్నారు.
సీటీ రవిపై చర్యలకు డిమాండ్
మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవిపై చర్యలు తీసుకోవాలని అఖిలభారత వీరశైవ మహాసభ అధ్యక్షుడు శామనూరు శివశంకరప్ప డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment