ఏపీలో సిమ్‌లు.. దుబాయ్ నుంచి నేరాలు
బనశంకరి: ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దమొత్తంలో సిమ్‌కార్డులను సేకరించి సైబర్ వంచకులకు సరఫరా చేస్తున్న వ్యక్తులను మంగళూరు నగర సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన కణతల వాసుదేవరెడ్డి (25), ఏపీలో గోదావరి జిల్లాలకు చెందిన వీర వెంకట సత్యనారాయణరాజు అనే ఇద్దరు పట్టుబడినవారు. వీరు సైబర్ నేరగాళ్లతో ములాఖత్ అయ్యారు. భారత్‌కు చెందిన పలు టెలికాం కంపెనీల సిమ్‌కార్డులను దుబాయ్‌లోని సైబర్ ముఠాలకు సరఫరా చేసేవారు. ఇద్దరూ 500 కు పైగా సిమ్‌కార్డులను పంపారు.
ఇలా గుట్టు రట్టయింది
వీర వెంకటసత్య నారాయణరాజు పలువురికి మోసపూరిత వాట్సాప్ లింక్‌లు పంపి రూ.10. 84 లక్షలను దోచుకున్నాడు. మంగళూరువాసి మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇటీవల రాజును పోలీసులు పట్టుకొని విచారించగా, సిమ్‌కార్డుల దందా బయటపడింది. రెండురోజుల కిందట వాసుదేవరెడ్డి ఢిల్లీ విమానాశ్రయంలో ఉండగా అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. విశాఖపట్టణం, గోదావరి జిల్లాల నుంచి సిమ్‌కార్డులను సేకరించి విదేశాలకు పంపించినట్లు తేలింది. రాజు నుంచి 300 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజు దుబాయ్‌లోని విన్సెక్స్ అనే కంపెనీకి సిమ్‌లను పంపించాడు. అక్కడ మోసగాళ్లు కాల్‌సెంటర్ తెరిచి అమాయకులకు ఫోన్లు చేసేవారు, షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి అని ఆర్థిక మోసాలకు పాల్పడేవారని కమిషనర్ తెలిపారు. కాల్స్‌కు, బ్యాంకు ఖాతాలకు ఈ సిమ్‌లను వాడేవారు. శివ అనే మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
మంగళూరులో ఒడిశా, గోదావరి వాసుల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment