పాఠశాలకు బాంబు బెదిరింపు
శివాజీనగర: రాజధానిలో మరో ప్రతిష్టాత్మకమైన పాఠశాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలోని బిషప్ కాటన్ పాఠశాలకు గురువారం ఉదయం ఈమెయిల్ వచ్చింది. పాఠశాలలో బాంబు పెట్టామని, ఎప్పుడైనా పేలిపోతుందని అందులో బెదిరించారు. ఈమెయిల్ చూసిన సిబ్బంది తక్షణమే కబ్బన్ పార్క్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బాంబు స్క్వాడ్, శునకాలతో చేరుకుని పాఠశాలలో క్షుణ్ణంగా వెతికారు. ఎలాంటి పేలుడు వస్తువులు లభించలేదు. ఉత్తుత్తి బాంబు బెదిరింపుగా తేల్చారు. కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంతో పిల్లలు, తల్లిదండ్రులు తీవ్ర కంగారుకు గురయ్యారు. విద్యార్థులను మధ్యలోనే ఇళ్లకు తీసుకెళ్లారు.
టీచరమ్మ దాష్టీకం
మండ్య: గోళ్లు కత్తిరించుకోలేదని కారణంతో ఓ ఉపాధ్యాయిని.. విద్యార్థినికి బలవంతంగా గోళ్లు కత్తిరించడంతో రక్తం కారింది. దీంతో తల్లిదండ్రులు బాలల రక్షణా కేంద్రంలో ఫిర్యాదు చేశారు. వివరాలు.. జిల్లాలోని శ్రీరంగపట్టణానికి చెందిన న్యూ ఆక్స్‌ఫర్డ్ ప్రైవేట్ పాఠశాలలో మహాలక్ష్మి అనే బాలిక 6వ తరగతి చదువుతోది. గీతా అనే టీచరు.. బాలిక గోళ్లు కత్తిరించుకోలేదని ఆగ్రహించింది. చేతిపై కొట్టి రక్తం కారేలా నిర్లక్ష్యంగా గోళ్లు కత్తిరించినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసు స్టేషన్, బాలల రక్షణా కేంద్రంలో ఫిర్యాదు చేశారు. అధికారులు పాఠశాలను సందర్శించి పరిశీలించారు. టీచరమ్మ దాష్టీకంపై పలువురు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment