దర్శన్ బెయిలు వాదనలు నేటికి వాయిదా
బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడు హీరో దర్శన్ బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. తీర్పు కోసం లక్షలాది మంది ఆయన అభిమానులు, ప్రజలకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆయన బెయిలు అర్జీ మళ్లీ వాయిదాపడింది. బుధవారం నగర 57 వ సీసీహెచ్ కోర్టులో దర్శన్ బెయిల్‌పై విచారణ సాగింది. ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆలకించిన న్యాయమూర్తి గురువారం 11.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు దర్శన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తారు. ఇదే కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న పవిత్రాగౌడ బెయిల్ పిటిషన్‌పై 14వ తేదీన విచారణ జరగనుంది.
రైల్వేమంత్రికి వినతులు
తుమకూరు: కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తుమకూరు–రాయదుర్గం, తుమకూరు–చిత్రదుర్గ–దావణగెరె రైలు మార్గాలను 2027 జూన్ నెలలో ప్రారంభించేందుకు తుమకూరుకు విచ్చేయాలని, తుమకూరు రైల్వేస్టేషన్‌కు డాక్టర్ శివకుమారస్వామీజీ రైల్వేస్టేషన్‌గా నామకరణం చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కోరారు. మరుగున పడిన తుమకూరు–రాయదుర్గం రైలుమార్గం భూస్వాధీన ప్రక్రియను 3 నెలల్లో 90 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.
సరస్వతీదేవి అలంకారం
బొమ్మనహళ్లి: దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా బొమ్మనహళ్ళిలోని అగరలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అలంకారం చేశారు. అర్చకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో హంసవాహనం పైన సరస్వతీ దేవి అలంకారం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో స్థానికులే కాకుండా నగరం నలుమూలల నుంచి భక్తులు వచ్చి దర్శించుకున్నారు.
సీఎం బావమరిదికి నోటీసులు
● ముడా స్థలాల కేసు...
మైసూరు: మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) నుంచి సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి అక్రమంగా 14 స్థలాలను కేటాయించిన కేసులో కోర్టు ఆదేశాలతో లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేపట్టడం తెలిసిందే. ఈ కేసులో ఏ3 నిందితుడు, సీఎం బావమరిది మల్లికార్జున, భూ యజమాని ఏ4 నిందితుడు దేవరాజుకు నోటీసులను పంపారు. 10న విచారణకు హాజరు కావాలని సూచించారు. ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణను ఇదివరకే విచారణ చేశారు. నగరంలోని కెసరె గ్రామాన్ని సందర్శించి ముడా స్వాధీనం చేసుకున్న భూమిని, అందుకు బదులుగా విజయనగరలో సీఎం భార్యకు కేటాయించిన 14 స్థలాలను సందర్శించి వివరాలు సేకరించారు. కోర్టు డిసెంబర్‌లోగా ముడా కేసు దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని సూచించిన నేపథ్యంలో ఏ1 నిందితుడు సీఎం సిద్దరామయ్య, ఏ2 నిందితురాలు భార్య పార్వతికి నోటీసులు జారీ చేస్తే రాజకీయ సంచలనం కానుంది.
అల్లుని చేతిలో అత్త హతం
చింతామణి: ఆస్తి తగాదాల వల్ల అత్త ప్రాణాలు తీశాడో కిరాతక అల్లుడు. ఈ సంఘటన రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని బింగానహళ్లి గ్రామంలో చోటుచేసుకొంది. వివరాలు.. కవితమ్మ (46)తో, అల్లుడు చంద్రు తరచూ ఆస్తి పంపకాలపై గొడవ పడేవాడు. ఇదే విషయమై బుధవారం బాగా మద్యం తాగి వచ్చి పోట్లాటకు దిగాడు. కవితమ్మను గొంతు పిసికి హత్య చేశాడు, మామ ఈశ్వరప్ప ఆడ్డురాగా అతనిపై దాడి చేయడంతో గాయపడ్డాడు. చుట్టుపక్కలవారు ఈశ్వరప్పని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్ పరిశీలించారు. హంతకుడు పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment