తండ్రి కాదు.. హంతకుడు | - | Sakshi
Sakshi News home page

తండ్రి కాదు.. హంతకుడు

Published Mon, Nov 25 2024 7:38 AM | Last Updated on Mon, Nov 25 2024 7:38 AM

-

శివమొగ్గ: ఆస్తి పంపకాల గురించి కుమారుడు ప్ర శ్నిస్తున్నాడని అతనిని హత్య చేశాడో కిరాతక తండ్రి. ఈ సంఘటన శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలోని బళ్లూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. లింగానాయక్‌కు, కుమారుడు గంగ్యా నాయక్‌ (32) ఉన్నాడు. ఆస్తిని పంచాలని గంగ్యానాయక్‌ తరచూ తండ్రిని ఒత్తిడి చేసేవాడు. శనివారం కూడా ఇద్దరి మధ్య దీనిపై రగడ మొదలైంది. ఆగ్రహానికి గురైన తండ్రి వేటకొడవలి తీసుకొని కొడుకు ఎదపై నరికాడు, తీవ్ర గాయాలైన కొడుకు.. తండ్రి కళ్ల ముందే మరణించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు శికారిపుర పోలీసులు వచ్చి పరిశీలించి హంతక తండ్రిని అరెస్టు చేశారు.

భర్త చేతిలో భార్య హత్య

బనశంకరి: భార్య శీలాన్ని అనుమానించిన భర్త ఆమెను హత్య చేసి పరారయ్యాడు. బెంగళూరు చంద్రాలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. గంగొండనహళ్లి మూడో మెయిన్‌రోడ్డు నివాసి గౌసియా బీ (31), వెల్డింగ్‌ పనులు చేసే ఇమ్రాన్‌ఖాన్‌ దంపతులు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. అతనిని బంధువుల ఇంట్లో వదిలేశారు. శుక్రవారం దంపతులిద్దరూ గొడవ పడ్డారు, ఇమ్రాన్‌ఖాన్‌ కోపం పట్టలేక చున్నీతో భార్య గొంతు బిగించి చంపి, ఇంటి తలుపు వేసి ఉడాయించాడు. శనివారం రాత్రి గౌసియా సోదరుడు ఫోన్‌ చేయగా తీయకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చి చూశాడు. ఇంటి తలుపు బయటి నుంచి వేసి ఉంది. తలుపు తీసి ఇంట్లోకి వెళ్లగా సోదరి మృతదేహం కనిపించింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పరిశీలించి మృతదేహానికి శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. భర్త కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

యాంటీ బయాటిక్స్‌ను మితిమీరి వాడొద్దు

బొమ్మనహళ్లి: చిన్న చిన్న జబ్బులకు కూడా ఎక్కువ మోతాదులో యాంటి బయోటిక్స్‌ వాడకం పెరిగింది. ఇది వైరస్‌, బ్యాక్టీరియాల్లో నిరోధక శక్తిని పెంచుతుంది, అందుకే యాంటి బయాటిక్స్‌ని అవసరం మేరకే ఉపయోగించాలి అని బెంగళూరు గ్రామీణ ఎంపీ, వైద్య నిపుణుడు డా. సీఎన్‌ మంజునాథ్‌ అన్నారు. ఆదివారం బెంగళూరులో ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. అనేక ఆరోగ్య సమస్యలకు జ్వరమే మొదటి లక్షణం, జ్వరం వస్తే క్షుణ్ణంగా పరీక్షలు చేయడం చాలా ముఖ్యమని అన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున వైద్యులు రోగి సమాచారాన్ని పరిశీలించి వైద్యం చేస్తారని అన్నారు. చాలా మంది వైద్యులు నేటిరోజుల్లో రోగులను చూడడం లేదన్నారు. రోగులను చూసి, నాడి పట్టుకుని తాకడం ద్వారా చాలా నేర్చుకోవచ్చని అన్నారు.

నిఖిల్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ ఉప ఎన్నికలో నిఖిల్‌ కుమారస్వామి ఘోరంగా ఓడిపోవడంతో ఆయన అభిమానులు బాధాతప్తులయ్యారు. చెన్నపట్టణ తాలూకా శ్రీరాంపురం గ్రామంలో మంజునాథ్‌ అనే అభిమాని శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆదివారంనాడు నిఖిల్‌ మంజునాథ్‌ ఇంటికి వెళ్లి పరామర్శించాడు. ఎన్నికలు అన్నాక గెలుపోటములు సాధారణమని ఓదార్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement