No Headline
ఆదివారం ఉదయం బెంగళూరు
శివార్లలో పొగమంచు
సాక్షి, బెంగళూరు: ఒకవైపు ఉప ఎన్నికల రాజకీయ వేడి ముగిసిపోగానే కన్నడనాడును చలి వణికిస్తోంది. రాత్రి నుంచి సూర్యోదయం వరకు ఎముకలు కొరికే చలితో ప్రజలు గజగజలాడుతున్నారు. జనవరి వరకు ఈ చలి ఇలాగే కొనసాగనున్నదని వాతావరణ శాఖ చెబుతోంది. సాధాణం కంటే అధికంగా వర్షాలు రావడం, నేల, వాతావరణంలో తేమ శాతం పెరగడం తదితర కారణాల వల్ల చలి పెరిగింది. చలితో పాటు ఉదయం వేళల్లో మబ్బులు కమ్మేసి చల్లని గాలులు వీస్తున్నాయి. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సగటున రెండు నుంచి మూడు డిగ్రీల మేర తగ్గుముఖం పట్టాయి. రానున్న రెండునెలల్లో ఈ వ్యత్యాసం 3 నుంచి 4 డిగ్రీల మేర ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉద్యాననగరిలో చలి, గాలులు
ఐటీ నగరంలో రాత్రి, ముఖ్యంగా తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్య చలి గాలులు వేగంగా వీస్తున్నాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా బెంగళూరులో డిసెంబర్ మూడో వారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గి చలి ప్రారంభం అవుతుంది. కానీ ప్రస్తుతం లా నినా మార్పుల వల్ల నవంబర్‌లోనే చలి పులి వచ్చింది. గత నాలుగు రోజుల నుంచి రాజధాని బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు పడిపోయింది.
ఈ జిల్లాల్లో ఎక్కువ
బెంగళూరు కంటే కల్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. విజయపుర, బీదర్, కలబురిగి, రాయచూరు, బాగలకోటె, కొప్పళ, హావేరి, ఉడుపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, చిక్కబళ్లాపుర, హాసన్, మైసూరు, మండ్య, దావణగెరె, రామనగర, శివమొగ్గ, యాదగిరి జిల్లాల్లో రాత్రివేళ ల్లో చలి అధికమైంది. బెంగళూరుతో సహా అనేక జిల్లాల్లో పొగమంచు ఆవరిస్తోంది. ఉత్తర కర్ణాటకలో మరీ అధికంగా ఉంది. దీని వల్ల వాహనదారులకు ఇబ్బందులు వస్తున్నాయి.
జాగ్రత్తలు పాటించాలి
ఉత్తర భారతదేశం నుంచి శీతల గాలులు వీస్తుండడం వల్ల కూడా చలి పెరిగింది. ఈ కారణంగా దగ్గు, జలుబు వంటి వ్యాధులు ప్రస్తుతం నెమ్మదిగా ప్రబలుతున్నాయి. తెల్లవారుజామున వాకింగ్‌కు వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి, పొగమంచు కారణంగా శ్వాసలో ఇబ్బందులు రావచ్చని తెలిపారు. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగడం, శుభ్రమైన వేడివేడి ఆహారాన్ని మాత్రమే తినడం ఉత్తమమని తెలిపారు. శరీరం నిండా కప్పుతూ దట్టమైన దుస్తులు ధరించడం మంచిదని తెలిపారు.
అసలైన చలి కాలం అదే
‘బెంగళూరులో చలి వాతావరణ పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. చలి కాలం ఇంకా ప్రారంభం కాలేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు 23–24 డిగ్రీలకు, కనిష్ట ఉష్ణోగ్రతలకు 16 డిగ్రీలకు దిగువకు చేరుకుంటేనే చలికాలంగా పరిగణిస్తాము. డిసెంబర్ నెల నుంచి చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంది’
– సీఎస్ పాటిల్, వాతావరణ శాఖ డైరెక్టర్, బెంగళూరు
రాష్ట్రంలో శీతాకాలం ప్రభావం
చలి, గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
కమ్మేస్తున్న పొగమంచు
పలు జిల్లాలకు వర్షసూచన
శివాజీనగర: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో డిసెంబర్ 10 వరకు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరులో ఆదివారం ఉదయం పొగమంచు అలముకొంది. మధ్యాహ్నం వరకు ఆకాశం మబ్బులు కమ్ముకుంది. సాయంత్రం 4 గంటలైనా సూర్య కిరణాలు వెలుగు చూడలేదు. ఆదివారం నుంచి డిసెంబర్ 2 వరకు బెళగావి, ఉత్తర కన్నడ, హావేరి, విజయనగర, శివమొగ్గ, ఉడుపి, మండ్య, రామనగరలో మేఘావృతమై సాధారణ వర్షం కురిసే అవకాశముంది. మిగతా జిల్లాలో చలి కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమి ఉండవచ్చని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో 10వ తేదీ వరకు వర్షాలు కురిసే ఆస్కారముంది.
Comments
Please login to add a commentAdd a comment