విధులకు వెళ్తానంటూ అనంత లోకాలకు
● చెరువులోకి దూకి జవాన్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద మూకలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు, కానీ ఎంత కష్టం వచ్చిందో ఊళ్లో చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. సెలవులపై ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా దేవాంగ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి నరేశ్ యల్లప్ప అగసర (28) మృతుడు. నరేశ్ ఆరేళ్ల కిందట జవాన్‌గా ఉద్యోగంలో చేరాడు. రెండేళ్ల క్రితం పెళ్లయినట్లు తెలిసింది. 20 రోజుల క్రితం ఊరికి వచ్చాడు. శనివారంనాడు తిరిగి వెళ్తానని ఇంట్లో చెప్పి బయలుదేరిన నరేశ్ ఊరిబయట చెరువులోకి దూకాడు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి కావడంతో గాలింపు జరపలేదు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆదివారంనాడు చెరువులో వెతికి మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తెలిసింది. కిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
దర్శన్ బెయిలు రద్దును
కోరతాం: హోంమంత్రి
శివాజీనగర: రేణుకాస్వామిని హత్య చేసిన స్థలంలో నటుడు దర్శన్ ఉన్న ఫోటో పోలీసులకు లభించింది. ఆ సమయంలో ఎవరో ఆయనతో ఉన్నవారు వీడియో తీసుకొన్నారు. ఈ అంశాలను హైకోర్టులో సమర్పించి బెయిల్ రద్దు చేయాలని కోరతాము అని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ఆదివారం బెంగళూరులో సదాశివనగర ఇంటిలో మీడియాతో మాట్లాడుతూ దర్శన్‌కు ఇప్పటికీ ఆపరేషన్ చేయలేదు, ఆయనకు సర్జరీ అవసరం లేదనేది తెలిసింది. శస్త్రచికిత్స చేయకపోతే వెన్నెముక విరిగిపోతుందని చెబుతుండేవారు. ఇన్ని రోజులైనా ఎందుకు ఆపరేషన్ చేయలేదు. ఇది కోర్టులో చర్చించాలని చెప్పారు.
విలేకరుల ఆటల పోటీలు షురూ
తుమకూరు: తుమకూరు నగరంలో జిల్లా పరిపాలనా యంత్రాంగం, విలేకరుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విలేకరుల క్రీడా పోటీలు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం విశ్వవిద్యాలయం నుంచి ర్యాలీ జరిపారు. నగర ఎమ్మెల్యే జీ.బీ.జ్యోతిగణేష్, కలెక్టర్ శుభ కళ్యాణ్ జెండా ఊపి ప్రారంభించారు. మహాత్మా గాంధీ స్టేడియానికి ర్యాలీ సాగింది. కళా బృందాల ప్రదర్శనలు అలరించాయి. జడ్పీ సీఈఓ జి.ప్రభు, వర్సిటీ వీసీ ప్రొ.వెంకటేశ్వర్లు, కమిషనర్ బి.వి.అశ్విజ, అధికారులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలను కేంద్ర మంత్రి వి.సోమన్న పాల్గొని ప్రారంభించారు. ఆటల్లో పాల్గొనడం ద్వారా ఉత్సాహంగా ఉండవచ్చని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment