చిన్నబోయిన కెమెరా
● ప్రముఖ ఫోటోగ్రాఫర్ సాగర్ మృతి
రాయచూరు రూరల్: జిల్లాలో ఫోటోగ్రాఫర్‌గా పేరుపొందిన సంతోష్ సాగర్ (43) అకాల మరణం పాలయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో నగరంలోని బెస్తవారి పేటలో నివాసంలో గుండెపోటుతో మరణించారు. తండ్రి, కుటుంబ సభ్యులతో మామూలుగానే మాట్లాడి నిద్రపోయారు. తరువాత ఆరోగ్యం బాగాలేదని చెబుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సాగర్ గత 18 ఏళ్లుగా ఫోటోగ్రాఫర్‌గా అనేక ప్రముఖ సంఘటనలను కెమెరాలో బంధించారు. ప్రముఖ పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. రాయచూరులో వినాయక చవితి ఉత్సవాలు ఆయన కెమెరాలో అద్భుతంగా వచ్చేవి. ప్రముఖ ఫోటోగ్రఫీ వెబ్‌సైట్ కేపీఎన్ సభ్యునిగా సేవలందిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం సాయంత్రం గద్వాల రహదారిలోని శ్మశానవాటికలో జరిగాయి. సాగర్ మరణం పట్ల ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
బ్యాంకుకు బాంబు బెదిరింపు
శివాజీనగర: బెంగళూరులో బాంబు బెదిరింపులు బ్యాంకులకు కూడా మొదలైంది. బుధవారం ఎంజీ రోడ్డులో ఉన్న హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో బాంబు పెట్టాను, త్వరలోనే పేలిపోతుందని గుర్తుతెలియని దుండగుడు ఈ మెయిల్ ద్వారా బెదిరించాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హలసూరు పోలీసులు పరిశీలించగా ఎలాంటి పేలుడు వస్తువులు దొరకలేదు. దుండగుని కోసం గాలింపు చేపట్టారు.
వాటా కావాలంటూ
సీఎం భార్యపై కేసు
మైసూరు: ముడా వ్యవహారంలో సీఎం సిద్దరామయ్య కుటుంబంపై మరొక కేసు కోర్టులో నమోదైంది. ఇక్కడి కెసరెలో 3.16 ఎకరాల భూమిని సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జున స్వామికి విక్రయించిన కేసులో ఏ4 నిందితుడు జే.దేవరాజు తమ్ముడైన మైలారయ్య కుమార్తె జమున సీఎం సిద్దరామయ్య భార్య పార్వతిపై ఫిర్యాదు చేశారు. కెసరె గ్రామ సర్వే నెంబర్–464లోని తమ పిత్రార్జిత ఆస్తి అయిన ఆ భూమిలో తమకూ వాటా ఇవ్వాలని సీఎం కుటుంబంపై జమున మైసూరు సివిల్ కోర్టులో దావా వేశారు. సీఎం బావమరిదిపైనా ఫిర్యాదు చేశారు. దేవరాజు కుటుంబం, ముడా కమిషనర్, జిల్లాధికారిని పార్టీని చేశారు.
కిల్లర్ లవర్ కోసం గాలింపు
బనశంకరి: ప్రేమ– ద్రోహం గొడవలతో ప్లాన్ ప్రకారమే ప్రియురాలిని ప్రియుడు హత్య చేసినట్లు అసోం యువతి మాయా గొగోయ్ కేసులో పోలీసులు నిర్ధారించారు. బెంగళూరు ఇందిరానగరలో ఓ సర్వీసు అపార్టుమెంటు ఫ్లాటులో మాయా అనే ప్రైవేటు ఉద్యోగిని హత్యకు గురికావడం తెలిసిందే. స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ఆరవ్ ఆర్ని రెండు రోజులు శవం వద్దే గడిపాడు. ఆమెను చంపడం కోసం చాకును తీసుకెళ్లాడు. ఆన్‌లైన్‌లో నైలాన్ తాడు కొనుగోలు చేశాడు. ముందుగా తాడుతో మాయాకు గొంతుకు బిగించి హత్యచేసినట్లు కనబడింది. తరువాత కత్తితో పొడిచాడు. మంగళవారం ఉదయం 8.30 సమయంలో అతడు రూంని ఖాళీ చేశాడు. కేరళకు పారిపోయాడని భావిస్తున్నారు. పోలీసులు కేరళ, మహారాష్ట్రకు వెళ్లారు. నగరంలనూ గాలిస్తున్నారు. ఆరవ్ స్వస్థలం కేరళ కాగా, సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆరేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. మాయా సోదరి కూడా బెంగళూరులోనే ఉంటుంది. సోదరికి శుక్రవారం కాల్ చేసి, ఆఫీసులో పార్టీ ఉంది, రాత్రి ఇంటికి రాను అని చెప్పిన మాయా, మళ్లీ శనివారం ఒకసారి మెసేజ్ పంపింది. ఆ తరువాత కాంటాక్టులో లేదు.
జైలర్ వర్సెస్ ఖైదీలు
దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని జైలర్ అనిత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment