పుట్టగానే ఎత్తుకెళ్లారు
దొడ్డబళ్లాపురం: కలబుర్గి నగరంలోని జిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు కిడ్నాప్ కలకలం సృష్టించింది. పుట్టిన కొన్ని గంటలకే బిడ్డదూరం కావడంతో తల్లి, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వివరాలు.. జిల్లాలో చిత్తాపుర తాలూకా రావూర గ్రామానికి చెందిన రామక్రిష్ణ భార్య కస్తూరికి జిమ్స్ ఆస్పత్రిలో 25వ తేదీన కాన్పయి మగ బిడ్డ పుట్టాడు. కొంత సేపటికి నర్సుల దుస్తుల్లో ఇద్దరు మహిళలు వచ్చారు. కస్తూరి వద్దకు వెళ్లి బిడ్డకు పక్కనే గదిలో ఔషధం ఇచ్చి తీసుకువస్తామని చెప్పి చిన్నారితో ఉడాయించారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లి, బంధువులు వైద్యులు, నర్సులకు అడిగారు. తమకు తెలియదని చెప్పడంతో తల్లి లబోదిబోమంది. వారు స్థానిక బ్రహ్మపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. మరోవైపు మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ తల్లిదండ్రులను పరామర్శించారు. పోలీస్ కమిషనర్ శరణప్ప దాగే, ఏసీపీ బూతే గౌడ, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు బుధవారం శిశువును కనిపెట్టి తల్లికి అప్పగించారు. 36 గంటల తరువాత తల్లీ బిడ్డ ఒక్కటి కావడంతో బంధువుల ఆనందానికి అవధులు లేవు. శిశువు ఆరోగ్యంగానే ఉంది.
రూ. 50 వేలకు అమ్మేశారు
ఇక నిందితుల విషయానికి వస్తే కలబుర్గి ఎంఎస్‌కే మిల్స్ ప్రాంతానికి చెందిన ఉమేరా, ఫాతిమా, నస్రీన్ అనేవారు శిశువును ఎత్తుకెళ్లారు. ఖైరూన్ అనే మహిళకు రూ. 50 వేలకు అమ్మేశారు. ముగ్గురినీ అరెస్టు చేయగా, ఖైరూన్ పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. శిశు విక్రయాల కోసమే అపహరించారని చెప్పారు. దీంతో నిందితులపై అందరి దృష్టి పడింది. వీరు ఇంకా ఎంతమంది పిల్లలను ఇలా ఎత్తుకెళ్లి అమ్మేశారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది. ఆస్పత్రిలోని బాలింతలు ఉలిక్కిపడ్డారు. నిందితులను పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
36 గంటల తరువాత తల్లి ఒడికి
కలబుర్గిలో కిడ్నాప్ సుఖాంతం
ముగ్గురు మహిళల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment