అక్రమార్కులకు కునుకు కరువు
బనశంకరి/ తుమకూరు: ఈ నెలలో మూడోసారి లోకాయుక్త అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లంచాలు, అక్రమాస్తుల ఆరోపణలు వెల్లువెత్తడంతో బెంగళూరులో, తుమకూరులో సోదాలు జరిపారు. దీంతో ప్రభుత్వ అధికారుల్లో లోకాయుక్త భయం ఆవరించింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారని ఫిర్యాదులు రావడంతో ఇద్దరు బెంగళూరు పాలికె అధికారుల ఇళ్లు, ఆఫీసుల్లో బుధవారం లోకాయుక్త అధికారులు తనిఖీలు నిర్వహించారు. బీబీఎంపీ సాంఘిక సంక్షేమ అధికారిణి లలిత, డిప్యూటీ ఆర్థిక కంట్రోలర్ సత్యమూర్తిలపై లోకాయుక్త అధికారులు దాడులు జరిపారు. బీబీఎంపీ పశ్చిమ వలయ సాంఘిక సంక్షేమ విభాగంలో సంక్షేమ పథకాల అమల్లో లబ్ధిదారుల నగదును అక్రమంగా సొసైటీలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లోకాయుక్త ఎస్పీ శ్రీనాథ్ జోషి ఆధ్వర్యంలో డీఎస్పీ సునీల్ నాయక్, 8 బృందాలు దేవయ్యపార్కు వద్ద లలిత, వయ్యాలికావల్ జబ్బార్ బ్లాక్‌లో సత్యమూర్తి నివాసంలో ముమ్మరంగా గాలింపు ప్రారంభించారు. ఆధారాల పరిశీలన రాత్రి వరకూ కొనసాగింది.
ఆర్టీఓ ఆఫీసుల్లో దాడులు
తుమకూరులోని ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీఓ) ఆఫీసుతో పాటు జిల్లాలోని సహాయక ప్రాంతీయ రవాణా అధికారి (ఏఆర్టీఓ) కార్యాలయాలలో లోకాయుక్త అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నగరంతో పాటు మధుగిరి ఏఆర్టీఓ, తిపటూరు ఏఆర్టీఓ ఆఫీసుల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరిపి పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందిని విచారించారు. అధికారులు లక్ష్మినారాయణ, రామకృష్ణ నేతృత్వంలోని బృందం జిల్లాలో మూడు చోట్ల దాడి జరిపారు. ఆర్టీఓ ప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు. ఉద్యోగుల అవినీతి గురించి ప్రజల నుంచి ఫిర్యాదుల రావడమే కారణమని తెలిసింది. కార్యాలయ సిబ్బంది కార్యకలాపాలు, ఫైళ్ల నిర్వహణ, ప్రజాసేవలో సమర్థతపై తనిఖీ చేశారు. ఫైళ్లను, కంప్యూటర్లను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న ప్రజా పనులు, ఫిర్యాదుల గురించి ప్రశ్నించారు.
బెంగళూరులో ఇద్దరు పాలికె
అధికారులపై దాడి
అవినీతి ఆరోపణలే కారణం
తుమకూరులోనూ ముమ్మర సోదాలు
బడా బాబుల ఇళ్లకు ఐటీ
బనశంకరి: బెంగళూరులో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు 20 చోట్లకు పైగా ఆకస్మిక సోదాలు జరిపారు. బుధవారం ఉదయమే పలు బృందాలు రియల్ ఎస్టేట్, బిల్డర్లు, పలు కంపెనీల ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులకు వచ్చారు. నగరంలో వయ్యాలి కావల్, కత్రిగుప్పె, బనశంకరితో పాటు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేతలు, అక్రమ సంపాదన ఫిర్యాదులే కారణమని తెలిసింది. కేంద్ర బలగాల భద్రత మధ్య సోదాలు ప్రారంభమయ్యాయి. ఫైళ్లు, కంప్యూటర్లు, బ్యాంకు ఖాతాలు తదితరాల తనిఖీ కొనసాగింది. దాడులతో నగరంలో బడా బాబుల్లో గుబులు నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment