ప్రియురాలు పిలిచింది.. మొత్తం దోచేసింది
బనశంకరి: ప్రేమ అనే పదానికి మచ్చ తెచ్చేలా ఆ ప్రియురాలు వ్యవహరించింది. ప్రియున్ని అపహరించి దోపిడీకి పాల్పడి చివరకు కటకటాల పాలైంది. ఏపీలోని నెల్లూరుకు చెందిన ప్రేమ జంట వ్యవహారం బెంగళూరులో రచ్చయింది.
పెనుకొండకు పిలిపించి..
కోరమంగళ పోలీసులు తెలిపిన ప్రకారం... నెల్లూరుకు చెందిన శివ, మోనిక అనే యువతీ యువకులు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అతడు నెల్లూరులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. శివతో బాగా డబ్బు, బంగారం ఉన్నట్లు భావించిన మోనికలో దుర్బుద్ధి పుట్టింది. అతనిని కిడ్నాప్ చేసి బాగా వసూలు చేయాలని తనకు తెలిసినవారితో కుట్ర పన్నింది. ఆ ప్రకారం 4 రోజుల కిందట శివకు ఫోన్ చేసింది, నిన్ను నా స్నేహితులు చూడాలని, బంగారు నగలు ధరించి ఇన్నోవా కారులో రావాలని ఫోన్‌లో తెలిపింది. మోనిక మాటలను నమ్మిన శివ 60 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇన్నోవా కారులో పుట్టపర్తి జిల్లా హిందూపురం వద్ద పెనుకొండకు వచ్చాడు. అక్కడ మోనిక అనుచరులు శివను కారులోనే అపహరించి బంగారు ఆభరణాలు దోచుకుని పావగడకు తీసుకెళ్లి ఓ హోటల్‌లో బంధించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివ తన స్నేహితులతో మాట్లాడి తన బ్యాంక్ ఖాతాలోకి రూ.5 లక్షలు జమ చేయించాడు.
ఏటీఎం కార్డు తెప్పించి..
డబ్బు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు లేదు, దీంతో నెల్లూరులో ఇంటి నుంచి బెంగళూరు మెజిస్టిక్ అడ్రస్ కు కొరియర్ చేయించుకుని శనివారం రాత్రి బెంగళూరులోని కోరమంగలలో నగదు డ్రా చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో కిడ్నాపర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. గస్తీలో ఉన్న ఎస్‌ఐ మాదేశ్ అనుమానంతో వారిని విచారించగా కిడ్నాప్ కథ వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు మోనిక, హరీశ్, హరికృష్ణ, నరేశ్, రాజ్‌కుమార్, నరసింహ, అంజనీల్ అనే ఏడుమందిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లు కూడా నెల్లూరుకు చెందినవారని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. నిందితుల్లో ఇద్దరిపై 5 కు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రియురాలే దోపిడీకి సూత్రదారి అని తెలుసుకుని ప్రియుడు షాక్‌కు గురయ్యాడు. కేసు విచారణలో ఉందని డీసీపీ తెలిపారు.
ప్రియున్ని కిడ్నాప్ చేసి లూటీ
అనుకోకుండా పట్టుబడిన ముఠా
ప్రేమజంట, నిందితులు నెల్లూరువాసులు
Comments
Please login to add a commentAdd a comment