పాఠశాలలో కరెంటు షాక్
● బాలిక మృత్యువాత
బనశంకరి: ముద్దులొలుకుతూ ఇంటి వెలుగుగా ఉండే చిన్నారి పాప కరెంటు షాక్‌తో విగతజీవిగా మారింది. ఈ దుర్ఘటన ఉత్తరకన్నడ జిల్లా హుళియాళ తాలూకా ముండవాడగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయులు, విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం తల్లిదండ్రులకు విషాదం మిగిల్చింది.
వివరాలు... సాన్వి బసవరాజ్ గౌళి (8) అనే బాలిక పాఠశాలలో రెండో తరగతి చదువుతుంది. చదువు, ఆటపాటల్లో చురుకై నదిగా పేరుపొందింది. పాఠశాల ఆవరణలో బోరు వేయగా, దానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అయితే అంతా తొందరపాటుతో చేయడంతో గురువారం వైర్లు తెగిపడి మరుగుదొడ్డిపై పడ్డాయి. బాలిక మరుగుదొడ్డికి వెళ్లగా విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌తో అక్కడికక్కడే మరణించింది. హెడ్‌మాస్టర్ అలసత్వమే ఘోరానికి కారణమని బాలిక తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రాణం తీసిన కోడి గొడవ
మైసూరు: కోడి కొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. నిందితురాలు మహిళ కావడం గమనార్హం. గొడవ విడిపించేందుకు వచ్చిన ఓ వ్యక్తి మర్మాంగంపై మహిళ తన్ని హతమార్చిన ఘటన జిల్లాలోని టీ.నరసీపుర తాలూకా దొడ్డబాగిలు గ్రామంలో జరిగింది. వివరాలు.. రాజమ్మ, సిద్దమ్మ, నంజమ్మ అనే మహిళలు కోడి విషయంపై గొడవ పడుతున్నారు. శశికళ అనే మహిళ వారిని విడిపించబోగా ఆమెను లాగిపడేశారు. దీంతో శశికళను కాపాడేందుకు వెళ్లిన ఆమె భర్త మహదేవస్వామి (49) మర్మాంగంపై రాజమ్మ దాడి చేసింది. బాధితుడు నొప్పితో విలవిలలాడుతూ రోడ్డుపై పడి మరణించాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీ.నరసీపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కారు బోల్తా..
న్యాయవాది మృతి
మైసూరు: అదుపు తప్పిన కారు బోల్తా పడి అక్కడికక్కడే న్యాయవాది మరణించగా, పోలీస్ గాయపడ్డారు. ఈ ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర బెట్ట రోడ్డులోని తాళబెట్ట వద్ద జరిగింది. వివరాలు.. మైసూరుకు చెందిన న్యాయవాది హరీష్ కుమార్, ఉదయగిరి ట్రాఫిక్ పోలీసు విజయకుమార్ స్నేహితులు. మైసూరు నుంచి మలెమహదేశ్వర బెట్టకు కారులో వెళుతుండగా తాళబెట్ట వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడింది. కారు నడుపుతున్న హరీష్ కుమార్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. విజయకుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో, అటుగా వెళుతున్న వారు మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మలెమహదేశ్వర బెట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
హైకోర్టులో యడ్డికి స్వల్ప ఊరట
బొమ్మనహళ్లి: బీజేపీ మాజీ సీఎం బీ.ఎస్. యడియూరప్పపైన నమోదు అయిన పోక్సో కేసులో ఆయన వ్యక్తిగతంగా పోలీసు విచారణకు హాజరు కావడంపై ఉన్న మినహాయింపును హైకోర్టు పొడిగించింది. ఈ కేసును రద్దు చేయాలని యడ్డి దాఖలు చేసిన అర్జీపై గురువారం హైకోర్టులో విచారణ సాగింది. ఇది పోక్సో కేసు కాబట్టి వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వ వకీలు రవివర్మ కుమార్ వాదించారు. చివరకు యడ్డికి హాజరు నుంచి మినహాయింపును పొడిగిస్తూ డిసెంబర్ 2వ తేదీకి విచారణ వాయిదా వేశారు.
కేసు ఏమిటంటే
ఈ ఏడాది మార్చి 3వ తేదీన నగరంలోని సదాశివనగర పోలీసు స్టేషన్‌లో 17 ఏళ్ల అమ్మాయి తల్లి యడ్డిపై ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాము పని మీద ఆయన ఇంటికి వెళ్తే తన కూతురిని వేధించారని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment