కనుల పండువగా మైలార జాతర
సాక్షి,బళ్లారి: ప్రతి ఏటా మాఘ పౌర్ణమి అనంతరం రెండు రోజులకు ఆనవాయితీగా నిర్వహించే ఏళుకోటి మైలార లింగేశ్వర స్వామి జాతర, కార్ణిక మహోత్సవం కన్నుల పండువగా, భక్తిశ్రద్ధలతో ఆచరించుకున్నారు. శుక్రవారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హూవినహడగలి తాలూకాలోని మైలారలో వెలసిన ఏళుకోటి మైలార లింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ప్రతి ఏటా మాదిరిగా ప్రముఖ ఘట్టమైన కార్ణికోత్సవాన్ని గొరవయ్య ఉపవాసం ఉండి దైవ వాక్కు వినిపించారు. కార్ణికం అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలు సాక్షాత్తు శివుడే తెలుపుతారనే నమ్మకం భక్తుల్లో ఉంది. కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మైలార లింగేశ్వర స్వామి భక్తుడు గొరవయ్య ఎంతో నిష్టతో దాదాపు వారం రోజులకు పైగా ఉపవాసం ఉండి ఓ విల్లుపై ఎక్కి చెప్పే దైవవాణి కావడంతో గొరవయ్య కార్ణిక మహోత్సవాన్ని లక్షలాది మంది తిలకించారు.
కోరికలు తీర్చాలని భక్తుల వేడుకోలు
మైలారకు వచ్చిన భక్తులు కార్ణిక మహోత్సవంలో పాల్గొని తమ కోరికలు తీరడానికి పరిసరాల్లో నాలుగు లేదా ఐదు రాళ్లతో చిన్న ఇల్లు కట్టుకుని, కోరికలు తీర్చమని సాక్షాత్తు లింగరూపంలో అవతరించిన మైలార లింగేశ్వర స్వామిని వేడుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం సంప్రాయబద్ధంగా ఎద్దుల బండ్లలో విచ్చేశారు. వందలాది ఎడ్లబండ్లకు రకరకాల రంగులతో అలంకరించి, ఎద్దులను కూడా ఎంతో సుందరంగా అలంకరించి వాటిలో జనం కూర్చొని రావడం మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా నిలిచింది. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా రాష్ట్రంలో, దేశంలో జరిగే అంశాలు, ప్రజలకు ఏవిధమైన పరిస్థితులు తలెత్తుతాయన్న దానిపై ఒక్క వాక్యంలో చెబుతూ విల్లుపై నుంచి శుక్రవారం సాయంత్రం గొరవయ్య కిందకు పడిపోయారు. అనాది కాలం నుంచి వస్తున్న సంప్రదాయబద్ధమైన కార్ణికం ఆలయంలో పూజలు నిర్వహించిన భక్తులు కార్ణిక మహోత్సవాన్ని గొరవయ్య తన భవిష్యవాణి వినడానికి ప్రజాప్రతినిధులు, జిల్లాధికారి, ఎస్పీతోపాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
జనసంద్రమైన మైలార పుణ్యక్షేత్రం
ఎత్తైన విల్లును ఎక్కి గొరవయ్య భవిష్యవాణి వినేందుకు ఎటుచూసినా జనసంద్రంగా మైలార కనిపించింది. ఆలయ సమీపంలో డెంకనమరడి గ్రామంలో పొలాల్లో విల్లుపైకి ఎక్కి గొరవయ్య తుంబిద కొడ తుళికితలె పరాక్ అంటూ అని భవిష్యవాణి వినిపించి విల్లు పైనుంచి కిందకు దూకారు. గొరవయ్య కార్ణికం విన్న తర్వాత ఏడాది పొడవునా ఆయన చెప్పిన వాక్కు విధంగా ఉంటుందని అంచనాలు వేసుకున్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడు మైలారలో మైలార లింగేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు దర్శనం ఇస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు మైలారకు తరలివచ్చారు. మైలారలో భక్తులందరూ ఏళుకోటి మైలార లింగేశ్వర అంటూ నామస్మరణ చేస్తూ పునీతులయ్యారు. డెంకనమరడి ప్రాంతంలో కార్ణికం వినడానికి ముందుగా పక్కనే మైలారలో వెలసిన ఏళుకోటి మైలారలింగేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఆలయ కమిటీ, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని బందోబస్తు నిర్వహించారు.
లక్షలాది మంది సమక్షంలో
కార్ణిక మహోత్సవం
విల్లు పైకెక్కి దైవవాణి వినిపించిన గొరవయ్య
కనుల పండువగా మైలార జాతర
Comments
Please login to add a commentAdd a comment