
సాక్షి, బెంగళూరు: కర్నాకటలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య పెను దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్య వివాదం మాత్రం ఇంకా ముగిసిపోలేదు.
కాంట్రాక్టర్ ఆత్మహత్య విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా పరిష్కారం కాదన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి కేసులో ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి.. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌ను ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ అడిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడుందని ప్రశ్నించారు.
అవినీతి నిరోధక చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశ్వరప్పపై కేసు నమోదు చేయాలన్నది కర్ణాటక ప్రజల డిమాండ్ అని శివకుమార్ అన్నారు. ఈశ్వరప్ప, అతని స్నేహితులు రమేశ్, బసవరాజ్‌ను కూడా అరెస్టు చేయాలని శివకుమార్ కోరారు. విచారణ ప్రారంభించకముందే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ‍్యలు చేశారు.