ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి

Published Tue, May 7 2024 4:25 AM

ధాన్య

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 236 కేంద్రాలకు గాను 78 కేంద్రాల్లో 11,317.720 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ కూడా ధాన్యం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. అలాగే, రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టి.. సీఎంఆర్‌ ఎంత, ఇతరత్రా ధాన్యం ఎంత అనేది పరిశీలించాలని కలెక్టర్‌ తెలిపారు. ఇక రైతులకు నగదు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అగ్ని ప్రమాదాలకు నివారణపై అవగాహన

జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నందున, పొలాల్లో పంట వ్యర్థాలు కాల్చకుండా రైతు వేదికల ద్వారా చైతన్యం కల్పించాలన్నారు. ప్రమాదాలపై విచారణ చేపట్టిన కారకులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. అలాగే, పిడుగు పడిన సమయాన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈసమీక్షల్లో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌, వివిధ శాఖల అధికారులు సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, విజయనిర్మల, సన్యాసయ్య, చందన్‌కుమార్‌, శ్రీలత, ఆఫ్రిన్‌ సిద్ధిఖీ, వెంకటరమణ, హరికిషన్‌, రేమాండ్‌ బాబు పాల్గొన్నారు.

సైబర్‌ మోసాల బారిన పడొద్దు

ఖమ్మంక్రైం: పెట్టుబడులు, అధిక లాభాలు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట నమ్మించే సైబర్‌ నేరస్తుల వలలో పడి మోసపోవద్దని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. ఇటీవల ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట రూ.లక్షల్లో మోసపోయినట్లు పలువురు సైబర్‌క్రైమ్‌ పోలీసుస్టేషన్లలో ఫిర్యా దు చేస్తున్న నేపథ్యాన కమిషనర్‌ పలు సూచనలు చేశారు. అపరిచితుల నుంచి వచ్చే లింక్‌లు, మెసేజ్‌లను నమ్మొద్దని తెలిపారు. అలాగే, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు, టాస్క్‌ల పేరిట కొంత కాలం డబ్బులు ఇచ్చి ఆతర్వాత భారీగా పెట్టుబడి పెట్టించి ముఖం చాటేస్తారని చెప్పారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్త వ్యవహరించాలని సీపీ సూచించారు. ఇంకాక్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్‌ పేరిట వచ్చే మెసేజ్‌లకు స్పందిస్తే లాభాలు ఉండకపోగా మోసం ఎదురవుతుందని తెలిపారు. కాగా, సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కి ఫోన్‌ చేయడం లేదా cybercrime.gov.in లో రిపోర్ట్‌ చేయాలని సీపీ ఓ ప్రకటనలో సూచించారు.

అందుబాటులోకి

పత్తి విత్తనాలు

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సమీపిస్తున్న వేళ పత్తి విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఖరీఫ్‌లో పత్తి పంటే ముందుగా సాగు చేస్తారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధాన పంటగా పత్తి సాగు చేయనుండగా ఈ ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా. ఈనేపథ్యాన ప్రభుత్వ అనుమతి ఉన్న వివిధ కంపెనీల బీటీ–1, 2 పత్తి విత్తనాలు ఆరు లక్షల ప్యాకెట్ల మేర అందుబాటులో తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలోని డీలర్లు ఇప్పటికే 25వేల పత్తి విత్తనాలను తెప్పించినట్లు సమాచారం. బీటీ–1 రకం విత్తనాల ప్యాకెట్‌ ధర రూ.635, బీటీ–2 ధర రూ.864గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రైతులకు సకాలంలో విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడమే కాక నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా కట్టడి చేయడంపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు.

జిల్లాకు బస్తర్‌ రాజు భంజ్‌దేవ్‌

ఖమ్మం మామిళ్లగూడెం: కాకతీయ సామ్రాజ్య వారసుడు, బస్తర్‌ రాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ సోమవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యాన స్వాగతం పలికారు. అనంతరం కమల్‌చంద్ర మాట్లాడుతూ ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు తరఫున ఖమ్మంలో ప్రచారం చేయడానికి వచ్చినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉప్పల శారద, అల్లిక అంజయ్య, కిరణ్‌, శ్యాంరాథోడ్‌, భద్రం, శ్రీదేవి, అంకతి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో  వేగం పెరగాలి
1/2

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి

ధాన్యం కొనుగోళ్లలో  వేగం పెరగాలి
2/2

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి

Advertisement
 
Advertisement