అన్ని వివరాలు నమోదు చేయాల్సిందే..
ఖమ్మంవైద్యవిభాగం: ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందులు, రోజువారీ పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి ఆదేశించారు. ఖమ్మం ముస్తఫానగర్‌లోని యూపీహెచ్‌సీని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ యంత్రంతో పాటు ఫార్మసి, ల్యాబ్ రూమ్‌ను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్‌లో పూర్తి వివరాలు నమోదు చేయకపోవడంపై ఫార్మసిస్టును ప్రశ్నించారు. మందుల పట్టిక బోర్డులోనూ వివరాలు ఏరోజుకారోజు నమోదు చేయాలని, వైద్య, ఆరోగ్య కార్యక్రమాలన్నీ సక్రమంగా చేపట్టాలని సూచించారు. అలాగే, వ్యాక్సినేషన్, మాతాశిశు సంక్షేమం తదితర అంశాలపై డీఎంహెచ్‌ఓ సూచనలు చేశారు.
విద్యుత్ సేవలకు
టోల్ ఫ్రీ నంబర్ 1912
ఖమ్మంవ్యవసాయం: రైతులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో విద్యుత్ సంబంధిత సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1912ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఖమ్మం ఎస్‌ఈ ఏ.సురేందర్ తెలిపారు. అందరికీ తెలిసిలా ట్రాన్స్‌ఫార్మర్లపై ఈ నంబర్ ముద్రిస్తున్నామని వెల్లడించారు. అలాగే, పొలంబాట కార్యక్రమంలోనూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 24గంటల పాటు ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్య తలెత్తినా సంప్రదించవచ్చని తెలిపారు.
ఎస్‌ఈ పోస్టు దక్కేదెవరికో?
ఖమ్మంఅర్బన్: జలవనరుల శాఖలో ఎస్‌ఈ పోస్టు భర్తీపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం సర్కిల్ ఇంజనీర్‌గా ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వర్తించిన నర్సింగరావు గతనెల 31న రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి పోస్టు ఖాళీగానే ఉండడంతో ఎవరిని నియమిస్తారోనని శాఖ ఇంజనీర్లు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కనీ సం ఇన్‌చార్జ్ బాధ్యతలు కూడా ఎవరికీ అప్పగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో నర్సింగరావు సెలవులో వెళ్లినప్పుడు పాలేరు ఈఈ ఎం.వెంకటేశ్వర్లు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించగా ఈసారి పోస్టు ఖాళీ గానే ఉంచడం గమనార్హం. అయితే, ఖమ్మం సర్కిల్ పరిధిలో రూ.వందల కోట్ల విలువైన సీతారామ ప్రాజెక్టు, మున్నేరు రిటైనింగ్ వాల్స్ పనులు జరుగుతుండడంతో పలు వురు ఇంజనీర్లు ఎస్‌ఈ పోస్టు కోసం మంత్రుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. గత వారం రోజులుగా నియామకంపై ప్రచారం జరుగుతున్నా ఎటూ తేలడం లేదు. దీంతో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక గతంలో ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తించిన పాలేరు ఈఈ వెంకటేశ్వర్లుకు అదనపు బాధ్యతలు ఇస్తారా అన్న మీమాంస నెలకొంది.
రేపు పాఠశాలల్లో
తల్లిదండ్రుల సమావేశాలు
‘ఇంటింటా చదువుల పంట’
యాప్‌పై అవగాహన
నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల స్థాయి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలిసేలా ‘ఇంటింటా చదువుల పంట’ యాప్‌ను వినియోగించనున్నారు. కరోనా సమయాన ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేందుకు ఈ యాప్‌ను రూపొందించినా ఆ తర్వాత కార్యకలాపాలు నిలిపివేశారు. ప్రస్తుతం మళ్లీ యాప్ ద్వారా అన్ని వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈనెల 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతీ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు(పీటీఎం) నిర్వహించి యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. జిల్లాలోని వసతి గృహాలు, మోడ ల్ స్కూళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలల్లో గురువారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించి యాప్ ఆవశ్యకతను వివరించాల్సి ఉంటుందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్ తెలిపారు. పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలు, విద్యార్థుల సామర్థ్యాలను యాప్‌లో అప్‌లోడ్ చేయనుండగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment