హక్కుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు
ఖమ్మం సహకారనగర్: ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టడమేకాక విద్యార్థు లకు మెరుగైన విద్యనందించడంపై దృష్టి సారించాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో భూసంబంధిత అంశాలు, అట్రాసిటీ కేసులపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ పాల్గొన్నారు. తొలుత శాఖల వారీగా ఎస్సీ, ఎస్టీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రీ, పోస్టు మెట్రిక్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్వహణ, ఇందిరా మహిళా శక్తి, కార్పొరేషన్ రుణాలు, దళిత బంధు, భూసమస్యలు, అట్రాసిటీ కేసుల వివరా లను అధికారులు వివరించారు.
నెలలోగా సమస్యల పరిష్కారం
కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ పెండింగ్ భూసమస్యలను నెలలోగా పరిష్కరించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలన్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ అద్దె భవనాల్లో ఉన్న 300 అంగన్‌వాడీలకు సొంత భవనాలు మంజూరు చేయించుకోవాలని, వీటి పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటు, ఆంగ్ల పరిజ్ఞానం పెంపునకు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ను అభినందించారు. ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిఫారసు చేస్తామని తెలిపారు. కాగా, పోలీస్‌స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారి సమస్యలు తెలుసుకుని మానవీయ కోణంలో పరిష్కరించాలని సూచించారు. ప్రతీనెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే అవగాహన పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
40 దరఖాస్తులు పెండింగ్
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలు ఇచ్చిన 40 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, నెల వ్యవధిలో పరిష్కరిస్తామని తెలిపారు. సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అందే ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏటా సుమారు 80 నుంచి 90 కేసులు వస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, అదనపు డీసీపీ నరేష్‌కుమార్, జిల్లా సాంగిక సంక్షేమ అధికారి కె.సత్యనారాయణతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు
మెరుగైన విద్య అందించడంపై దృష్టి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Comments
Please login to add a commentAdd a comment