ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి
ఖమ్మంసహకారనగర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా అన్ని వసతులు కల్పించి కొనుగోళ్లకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్షించిన వారు మాట్లాడారు. జిల్లాలో 2,88,888.78 ఎకరాల్లో వరి సాగుచేయగా 6,64,444.2 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందనే అంచనాలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకోసం 324 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయగా ఇప్పటికే 25,672 క్వింటాళ్ల ధాన్యం కేంద్రాలకు చేరిందని తెలిపారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోగా ధాన్యాన్ని మిల్లుకు రవాణా చేయాలని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమ, తాలు శాతంతో పాటు రహదారులపై ఆరబోస్తే జరిగే ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
గ్రూప్– 3 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
వచ్చేనెల 17, 18వ తేదీల్లో జరగనున్న గ్రూప్–3 పరీక్షలకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె మరో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ జిల్లాలో 27,984 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానుండగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విజయ ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్‌బీఐటీ ప్రిన్సిపాళ్లు రీజినల్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతీ 150 మంది అభ్యర్థుల గుర్తింపును తనిఖీ చేసేందుకు ఒక ఉద్యోగిని కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈసమావేశాల్లో డీఆర్వో ఎం.రాజేశ్వరి, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలత, ఆర్డీఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఇబ్బంది పడకుండా అన్ని వసతులు
అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment