జాతీయ స్థాయిలో గిరిజన యువకుడి సత్తా
పేటెంట్స్ అండ్ డిజైన్స్ ఎగ్జామినర్‌గా ఎంపికై న కార్తీక్
రఘునాథపాలెం: మండలంలోని సుకినీ తండాకు చెందిన మాలోత్ కార్తీక్ కేంద్రప్రభుత్వం పరిధిలో గెజిటెడ్ స్థాయి ఉద్యోగం సాధించాడు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో ఆయన 515 ర్యాంకు సాధించాడు. దీంతో మినిస్ట్రీ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌లో పేటెంట్స్ అండ్ డిజైన్స్ ఎగ్జామినర్‌గా ఎంపికయ్యాడు. గతేడాది డిసెంబర్ 23న ప్రిలిమినరీ, ఈ ఏడాది జనవరి 25, ఫిబ్రవరి 5న మెయిన్స్ పేపర్–1, 2 పరీక్షలతో పాటు ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు కార్తీక్ హాజరు కాగా, సోమవారం ప్రకటించిన ఫలితాల్లో ఉద్యోగం సాధించినట్లు వెల్లడైంది. సుకినీతండాకు చెందిన మాలోతు బాషా ఎక్సెజ్ ఎస్‌ఐగా, ఆయన సతీమణి పార్వతి వైరాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం బల్లేపల్లిలో నివసిస్తుండగా వీరికి మౌనిక, కార్తీక్ సంతానం. వీరిలో కార్తీక్ గౌహతి ఐఐటీలో 2019లో ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో జాతీయ స్థాయి 27వ ర్యాంకు సాధించి తమిళనాడులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేస్తూనే పేటెంట్స్ అండ్ డిజైన్స్ ఎగ్జామినర్ ఉద్యోగానికి ఎంపికై న ఆయనను పలువురు అభినందించారు. కాగా, ఐఈఎస్ సాధించాలన్నది తన లక్ష్యమని కార్తీక్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment