గోదారమ్మకు పుణ్యనదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యాన సోమవారం నిర్వహించిన పుణ్య నదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోదారమ్మకు నదీ హారతి సమర్పించారు. కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం రోజున భక్తులు, వేదపండితులు హారతులతో నదీమతల్లికి నీరాజనం పలికారు. మేళతాళాలతో ఆలయం నుంచి బయలుదేరిన భక్తుల జై శ్రీరామ్, ఓం నమః శివాయ నామస్మరణలతో గౌతమీ తీరం పులకించింది. అర్చకుల ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ఈఓ రమాదేవి దంపతులు గోదావరికి పసుపు, కుంకుమ, వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్య నదీ హారతి కార్యక్రమాన్ని తిలకించారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్తంగి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment