రంగంలోకి జిల్లా బాస్‌లు..
● ధాన్యం, పత్తి కొనుగోళ్లపై దృష్టి ● పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల తనిఖీ
ఖమ్మం రూరల్/కూసుమంచి: ధాన్యం, పత్తి కొనుగోళ్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తేమ, తాలు పేరిట వ్యాపారులు కొర్రీలు పెడుతున్నారని, పత్తి తేమ శాతం నిర్ధారించకుండానే వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటిస్తుండడంతో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా డివిజన్, మండల స్థాయి అధికారులతో తనిఖీలు చేయిస్తూనే ఏకంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీసు కమిషనర్ సునీల్‌దత్ రంగంలోకి దిగారు.
తేమ పరీక్షించుకున్నాకే రావాలి
సీసీఐ కేంద్రాలు ఏర్పాటైన జిన్నింగ్ మిల్లులకు రైతులు తీసుకొచ్చే పత్తిని పరీక్షించి నాణ్యత ఆధారంగా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్‌లోని జిన్నింగ్ మిల్లును అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్టతో కలిసి ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పత్తి సాగు, దిగుబడి, తేమ శాతం, అందిన ధరపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 8 నుంచి 12శాతం తేమ ఉన్న పత్తికే మద్దతు ధర వస్తుందని, ముందుగానే పరీక్షించకుండా తీసుకొస్తే రవాణా ఖర్చులు నష్టపోతారని తెలిపారు. ఈ మేరకు పొలాల వద్దే తేమ శాతం చేయించుకోవాలని సూచించారు. ఆతర్వాత కూసుమంచి మండలం పాలేరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్టతో కలిసి పరిశీలించిన కలెక్టర్ ధాన్యం నాణ్యతపై ఆరాతీశారు. కేంద్రాలకు ఎప్పడు వచ్చారు, నిర్వాహకులు టార్పాలిన్ కవర్లు ఇచ్చారా, లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, నాణ్యమైన గన్నీబ్యాగ్‌లను సమకూర్చి కాంటా కాగానే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ బి.హరినాధ్‌బాబు, ఉద్యోగులు హిమబిందు, ఉమానగేష్, కొత్త జ్యోతి, సత్యవర్దన్ రాజ్, రామడుగు వాణి పాల్గొన్నారు.
ముదిగొండ/నేలకొండపల్లి: రైతులకు ఇబ్బంది ఎదురుకాకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలోని జిన్నింగ్ మిల్లులోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీపీ పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, తేమ శాతం ఆధారంగా ధర నిర్ణయిస్తున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, నేలకొండపల్లిలోని మార్కెట్ కార్యాలయానికి వెళ్లిన సీపీ.. మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు, ఉద్యోగులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. రాజేశ్వరపురంలోని అరుణాచలం రైస్ మిల్లు వద్ధ రైతుల ఆందోళన వివరాలు ఆరాతీశారు. మంగాపురంతండాకు చెందిన ఓ రైతు పంట నష్టపరిహారం అందలేదని తెలపగా ఏఓ రాధకు సూచనలు చేశారు. అనంతరం సింగారెడ్డిపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన సీపీ విద్యార్థినుల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముదిగొండ, కూసుమంచి సీఐలు ఓ.మురళి, సంజీవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment