అడుగడుగునా కల్తీ..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని హోటళ్లు, బేకరీల్లో ఏది తింటే ఏమవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఎందులో ఏం కల్తీ జరిగిందో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చాలా చోట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నాసిరకం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తు న్నా దీన్ని అరికట్టాల్సిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇదే అదునుగా కల్తీరాయుళ్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కుటీర పరిశ్రమలు పుట్టగొడుగుల్లా ఏర్పాటుకాగా.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా నాసిరకం ముడిసరుకులు వినియోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టినప్పుడు ఈ వ్యవహారం బయటపడుతుండగా మిగతా సమయాల్లో దందా షరా‘మామూలే’ అన్నట్లు కొనసాగుతోంది.
వీధికో కుటీర పరిశ్రమ
ఆహార పదార్థాలను తయారు చేసే కుటీర పరిశ్రమలు వీధికొకటి చొప్పున వెలుస్తున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు సమయాన ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తరచుగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీ చేయాలి. కానీ నిబంధనలు పాటించకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండా పలువురు పసుపు, కారం పొడులు, అల్లం పేస్టే కాక నూనెలు, మసాలా పౌడర్లు, నూడుల్స్, చిప్స్ తయారుచేస్తున్నారు. ఈక్రమాన నాసిరకం ముడి సరుకులు వినియోగిస్తున్నా అధికా రులు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
పట్టుబడినా ఆగని దందా
పలుమార్లు ఆహార పదార్థాల తయారీదారులు పట్టుబడినా మళ్లీ దందా కొనసాగిస్తుండడం గమనార్హం. నగరంలో పలుచోట్ల నాసిరకం, నాణ్యతలేని ఆహార పదార్థాలను నిల్వ చేసిన గోదాంలు, పరిశ్రమలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు గతంలో తనిఖీలు చేశారు. ఈక్రమాన పలువురిపై కేసులు నమోదు చేసినా దందాకు బ్రేక్ పడడం లేదు. చిన్నచిన్న కేసులు నమోదు చేయడం, కొద్దిమొత్తంలో జరిమానా విధిస్తుండడంతో వ్యాపారులు వెనుకంజ వేయకపోగా కొత్త వారు ఈ రకమైన వ్యాపారం చేసేందుకు ముందుకొస్తున్నారు.
ఆహార పదార్థాలు కలుషితం
పుట్టగొడుగుల్లా
కుటీర పరిశ్రమల ఏర్పాటు
నాణ్యత, అనుమతులు లేకుండానే నిర్వహణ
అయినా పట్టింపులేని
ఫుడ్ సేఫ్టీ అధికారులు
టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో బయటపడుతున్న లోపాలు
టాస్క్‌ఫోర్స్ అధికారులు వస్తేనే...
ఖమ్మం నగరంతోపాటు మధిర, సత్తుపల్లి, వైరా ప్రాంతాల్లో కూడా కల్తీ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్ అధికారులు వచ్చి దాడులు చేసినప్పుడు ఈ దందా కొన్నాళ్లు ఆగుతున్నా, మళ్లీ తర్వాత మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గతంలోనూ టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు చేసి కల్తీ జరిగినట్లు నిర్ధారించి ఆహార పదార్థాలను సీజ్ చేశారు. సోమవారం ఖమ్మం రిక్కాబజార్‌లోని ఓ ఇంట్లో దుర్వాసన వస్తున్న అల్లం పేస్ట్‌ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. చర్చి కాంపౌండ్‌లోని ఓ పిండివంటల తయారీ పరిశ్రమలో వినియోగించిన పదార్ధాల్లో కేన్సర్ కారకాలు ఉన్నాయని గుర్తించారు. మయూరిెసెంటర్‌లోని ఓ స్వీట్‌షాపు ఖార్కానా అపరిశుభ్రంగా ఉన్నట్లు తేల్చారు. అయితే, జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహిస్తే తప్ప కల్తీ దందాకు అడ్డుకట్ట పడే అవకాశం లేదనే చెప్పాలి.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ?
జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లావ్యాప్తంగా పలు కుటీర పరిశ్రమలు, హోటళ్లు ఉన్నా తనిఖీల మాటెత్తడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీ చేయకపోవడం, ఆపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటుండడం అక్రమార్కులకు కలిసొస్తోంది. ఆహార తయారీ, ప్రాసెసింగ్, పంపిణీ, అమ్మకం, దిగుమతిని నియంత్రించడం, పర్యవేక్షించడం తద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్ధారించడం ఫుడ్ అథారిటీ విధి. అయితే ఆ విధులేమీ అధికారులకు పట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment