మేమెంతో మాకంత.. | - | Sakshi
Sakshi News home page

మేమెంతో మాకంత..

Published Wed, Nov 20 2024 12:23 AM | Last Updated on Wed, Nov 20 2024 12:22 AM

మేమెం

మేమెంతో మాకంత..

సర్వే సమాజ భవిష్యత్‌కు

సంబంధించిన అంశం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం చేయిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమాజ భవిష్యత్‌కు సంబంధించిన అంశమని, ఇది వెనుకబడిన వర్గాలకు తోడ్పాటునందిస్తుందని బీసీ కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల్లో పెద్ద కులాలకే తప్ప చిన్న కులాలకు అవకాశాలు దక్కడం లేదన్న అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేపై ఎవరూ అపోహలు, ఆందోళనలు పెట్టుకోవద్దని, సర్వేలో ప్రజలకు అన్యాయం జరిగితే కమిషన్‌ చూస్తూ ఊరుకోదన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, కుటుంబీకులు తప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్‌ చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా, మళ్లీ ఎప్పుడు సర్వే జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎవరూ అపోహలు సృష్టించొద్దని, రూ.కోట్ల వ్యయంతో చేస్తున్న పని వృథా కాకుండా అధికారులు సామాజిక బాధ్యతగా పూర్తి చేయాలన్నారు. సర్వేలో వెల్లడయ్యే సమాచారంతో నివేదికను వచ్చేనెల 9న హైకోర్టుకు అందజేయనున్నామని చైర్మన్‌ వెల్లడించారు. అలాగే, తమ కమిషన్‌ విచారణ పూర్తయ్యాక ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కాగా, సంచార జాతుల వారు బీసీలతో తమకు సంబంధం లేదని పేర్కొనగా, రజకులను ఎస్సీల్లో చేర్చాలని, దూదేకులు ఫెడరేషన్‌ లేదా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, బీసీ కులాల పరిరక్షణకు బీసీ అట్రాసిటీ యాక్ట్‌ తీసుకురావాలని కొందరు కోరారని చెప్పారు. నాలుగేళ్ల క్రితం మాదిరి గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయని, బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని పలువురు పేర్కొనగా... ఇతర కార్పొరేషన్లను సొసైటీ యాక్ట్‌ ప్రకారం ప్రకటించి మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను కంపెనీస్‌ యాక్ట్‌ ప్రకారం చేసినట్లు తమ దృష్టికి తీసుకొచ్చారని చైర్మన్‌ తెలిపారు.

ఖమ్మంమయూరిసెంటర్‌: జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయంగానే కాక ఇతర రంగాల్లో తగిన రిజర్వేషన్లు కల్పించాలని, కుల వృత్తులతో జీవనం సాగించే వారికి సర్వేలో చెప్పుకునేందుకు కులం పేరు లేకపోవడంతో సంచార జాతులకు గుర్తింపు దక్కడం లేదని వివిధ పార్టీలు, కుల, ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. అంతేకాక బీసీల్లో కొన్ని కులాలకే పదవులు దక్కుతుండగా, ఆర్థికంగా వెనకబడిన కులాలకు సరైన అవకాశాలు లభించడం లేదని తమ వాదనలు వినిపించారు. బీసీ కమిషన్‌ ఆధ్వర్యాన సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనం కోసం ఖమ్మం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ విచారణ మంగళవారం చేపట్టారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ నేతృత్వాన జరిగిన విచారణలో సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, రంగు బాలలక్ష్మి, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్‌, జితేష్‌ వి.పాటిల్‌, ఖమ్మం సీపీ సునీల్‌దత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘాల నేతల నుండి వినతులు స్వీకరించడంతో పాటు వారి వాదనలు విన్నారు.

రిజర్వేషన్లు పెంచాలి..

ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతో బీసీల్లో ఉన్న అనేక కులాలకు సమన్యాయం జరగడం లేదని, ప్రధానంగా ముస్లిం మైనార్టీలు రాజకీయంగా నష్టపోతున్నారని పలువురు వివరించారు. ఉన్న రిజర్వేషన్లనే అన్ని కులాలకు పంచడంతో చాలామందికి అన్యాయం జరుగుతోందన్నారు. కులగణన సర్వేలో విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ అనే కులాలు లేకపోవడంతో ఎలా నమోదు చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉందని విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. మున్నూరుకాపులకు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఏజెన్సీ ప్రాంత గౌడ కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇస్తున్నా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు తప్పుడు కుల సర్టిఫికెట్లతో చేపలు పడుతుండగా గంగపుత్రులు తీవ్రంగా నష్టపోతున్నందున రూ.5వేల పెన్షన్‌ ఇప్పించి బీమా కల్పించాలని ఆ సంఘం నాయకులు కోరారు. అలాగే, వడ్డెరలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ సంఘ నేతలు వివరించగా బీసీ కులాలు, ఉపకులాలకు సంబంధించి మొత్తం 79 మంది తమ వాదనలను వినిపించారు.

అవకాశాలు కల్పించండి

బీసీ సంఘాల నేతలు వెల్లడించిన అంశాలు, అందజేసిన వినతుల ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయిస్తోందన్నారు. ఈ సర్వేలో ప్రజలు వివరాలన్నీ నమోదు చేయించుకోవాలని సూచించారు.

స్వామి ఆశీస్సులతో...

ఖమ్మం చేరుకున్నాక తొలుత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విచారణకు హాజరయ్యామని చైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. ఆతర్వాత పాత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించామని, పేదల అభ్యున్నతి కోసం ఆమె హయాంలో అనేక విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. బ్యాంకుల జాతీయీకరణతో చిన్న వ్యాపారులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకులు దగ్గరయ్యాయని తెలిపారు.

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచండి..

బీసీ కమిషన్‌కు వినతుల వెల్లువ

బహిరంగ విచారణలో వాదనలు

వినిపించిన ఉమ్మడి జిల్లా వాసులు

నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కమిషన్‌ వెల్లడి

సర్వేకు సహకరించేలా ప్రజలను

చైతన్యపరచాలని సూచన

79 దరఖాస్తులు..

ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ మాట్లాడుతూ బీసీ కమిషన్‌ చేపట్టిన విచారణలో 79 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 26 లక్షల జనాభా ఉన్నట్లు అంచనాతో సమగ్ర కుటుంబ సర్వే మొదలుపెట్టగా ఇప్పటివరకు 60 శాతం పూర్తయిందని చెప్పారు. ముందస్తు ఉన్న లెక్కల ప్రకారం బీసీ జనాభా 35 నుంచి 40 శాతం ఉంటుందనే అభిప్రాయం తెలిపామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో కుటుంబ సర్వే 70 శాతం మేర పూర్తయిందని వివరించారు. తొలుత వివిధ కుల సంఘాలు, పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రతినిధుల సౌలభ్యం కోసం అధికారులు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయడమేకాక రిజిస్ట్రేషన్లు, నోటరీ, జిరాక్స్‌ సేవలు ఉచితంగా అందించారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్‌ ప్రత్యేకాధికారి సతీష్‌, రెండు జిల్లాల బీసీ అభివృద్ధి అధికారులు జి.జ్యోతి, ఇ.ఇందిర తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మేమెంతో మాకంత..1
1/2

మేమెంతో మాకంత..

మేమెంతో మాకంత..2
2/2

మేమెంతో మాకంత..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement