ఇద్దరు మహిళలను కుటుంబాలకు అప్పగించిన ‘అన్నం’
ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయిన ఇద్దరు మహిళలకు ఆశ్రయం కల్పించడమే కాక వారు కోలుకున్నాక వివరాలు ఆరా తీసిన అన్నం ఫౌండేషన్ బాధ్యులు కుటుంబాలకు చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. భద్రాచలంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న రేణుక వెంట చంటిపాప ఉండగా, అక్కడి అధికారుల సూచనతో ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్‌కు తరలించి వైద్యం చేయించారు. ఆమె కోలుకున్నాక తనది నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రమని చెప్పడంతో అక్కడి పోలీసుల ద్వారా నిర్ధారించుకున్నారు. అలాగే, మరో మహిళ ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌లో తిరుగుతుండడంతో ఆశ్రయం కల్పించి నెమ్మదిగా వివరాలు ఆరా తీశారు. ఆమె మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములకు చెందిన నాగమణిగా చెప్పడంతో అక్కడికి ఫోన్ చేయగా నిజమేనని తేలింది. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మంగళవారం వాహనంలో ఇద్దరు మహిళలను తీసుకెళ్లి వారి కుటుంబానికి అప్పగించగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment