21న ‘లగచర్ల’ బాధితులకు సంఘీభావ ర్యాలీ
● హాజరుకానున్న మాజీ మంత్రి హరీశ్‌రావు ● 22న మార్కెట్ సందర్శన, పలు కుటుంబాలకు పరామర్శ
ఖమ్మంమయూరిసెంటర్: మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈనెల 21, 22వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వెల్లడించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి మంగళవారం ఆయన మాట్లాడారు. లగచర్ల బాధితులకు సంఘీభావంగా ఈనెల 21న సాయంత్రం ఖమ్మం పెవిలియన్ మైదానం నుండి జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో హరీశ్‌రావు పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు గిరిజనులు, పార్టీ కార్యకర్తలు హాజరుకావా లని కోరారు. అలాగే, 22న ఉదయం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను హరీశ్‌రావు నేతృత్వాన బీఆర్‌ఎస్ బృందం సందర్శించి పత్తి, మిర్చి రైతులతో మాట్లాడతారని తెలిపారు. అనంతరం చింతకాని మండలం ప్రొద్దుటూరు, లచ్చగూడెంల్లో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో పాటు ఇటీవల అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు ఖమర్, గుండాల కృష్ణ, వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment