డైట్.. కిటకిట !
● ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆసక్తితో ప్రవేశాలు ● ఈ ఏడాది 97 మంది అభ్యర్థుల కేటాయింపు ● రెండో విడత కౌన్సెలింగ్‌తో 100సీట్లు భర్తీ అయ్యే అవకాశం
డైట్ కళాశాలలో గత కొన్నేళ్లుగా ప్రవేశాల వివరాలు
విద్యాసంవత్సరం విద్యార్థులు
2013–2015 98
2014–2016 97
2015–2017 99
2016–2018 00
2017–2019 91
2018–2020 76
2019–2021 54
2020–2022 50
2021–2023 35
2022–2024 44
2023–2025 34
2024–2026 97
ఖమ్మం సహకారనగర్: గతంతో పోలిస్తే డైట్ కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించడం.. త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామనే ప్రకటనతో డైట్ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెరిగిందని భావిస్తున్నారు. ఖమ్మం డైట్‌లో 100 సీట్లు ఉండగా.. ఇప్పటి వరకు 97 మందిని కౌన్సెలింగ్ ద్వారా కేటాయించారు. వీరిలో 72 మంది కళాశాలలో చేరారు.
ఎలిమెంటరీ ఉపాధ్యాయులుగా..
డైట్(డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) కళాశాలలో కోర్సు పూర్తిచేయడం ద్వారా ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు అర్హత లభిస్తుంది. గతంలో దీనిని డీఎడ్(డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్)గా పిలిచేవారు. తాజాగా ఈ పేరును డీఎల్‌ఈడీ(డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)గా మార్చారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన విద్యార్థులు ప్రవేశపరీక్ష రాస్తే మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి డీఎల్‌ఈడీలో ప్రవేశం కల్పిస్తారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కోర్సు పూర్తిచేశాక టెట్ అర్హత సాధించి డీఎస్సీ రాస్తే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యే అవకాశం లభిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో ఏకై క కళాశాల
ఉమ్మడి జిల్లా అంతటికీ ఖమ్మం టేకులపల్లిలో డైట్ కళాశాల ఉంది. ఇక్కడ మొత్తం 100 సీట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. గత పదేళ్లలో అడపాదడపా మినహా ఈ స్థాయిలో ప్రవేశాలు పొందిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఇక 2016–18 విద్యాసంవత్సరానికి ఒక సీటు కూడా భర్తీ కాలేదు. ఆ తర్వాత ఏడాది మాత్రం 91 మంది విద్యార్థులు చేరారు. ఆపై మళ్లీ ప్రవేశాలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఈ ఏడాది మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా 97మందికి ఖమ్మం డైట్ కళాశాలను కేటాయించారు. ఇందులో 75 మంది చేరారు. త్వరలోనే రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుండగా మొత్తం సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు.
డీఎల్‌ఈడీ వైపు అడుగులు..
2013, 2017 సంవత్సరాలతో పాటు ఈ ఏడాది డీఎస్సీ నిర్వహించారు. త్వరలో టెట్ నిర్వహించే అవకాశముంది. అంతేకాక ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కొన్నేళ్లుగా డీఎల్‌ఈడీపై అంతగా ఆసక్తి చూపని విద్యార్థులు ఈసారి ఇటు వైపు దృష్టి సారించారు. డీఎల్‌ఈడీ కోర్సు పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతోనే పలువురు చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అధ్యాపకులు భావిస్తున్నారు.
97 మందిని కేటాయించారు...
డైట్ కళాశాలలో వంద సీట్లకు గాను ఈ ఏడాది మొదటి విడతగా 97 మందిని కేటాయించారు. వీరిలో 72 మంది చేరగా మిగతా వారు త్వరలో చేరే అవకాశముంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత పూర్తి సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నాం. ఎంతో భవిష్యత్ ఉండే కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– సామినేని సత్యనారాయణ, ప్రిన్సిపాల్, డైట్
Comments
Please login to add a commentAdd a comment