ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు
ఖమ్మం వైద్యవిభాగం/ఖమ్మం లీగల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖరరావు సూచించారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇటీవల ఘటనల నేపధ్యాన మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. అనంతరం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ ర్యాగింగ్ చేస్తే భవిష్యత్ బలవుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుపై మాత్రమే శ్రద్ధ వహిస్తూ చట్టాలను తెలుసుకుని నడుచుకోవాలని సూచించారు. ఈ సదస్సులో టౌన్ ఏసీపీ రమణమూర్తి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మామిడి హన్మంతతరావు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటలపై
దృష్టి సారించండి
కూసుమంచి: రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారిస్తే లాభాలు గడించొచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం. వీ.మధుసూధన్ తెలిపారు. మండలంలోని చేగొమ్మ, కిష్టాపురంల్లో రైతులు సాగు చేస్తున్న బొప్పాయి, ఆయిల్‌పామ్ తోటలను మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నాక మిర్చి తోటలను కూడా పరిశీలించి తెగుళ్ల నివారణపై సూచనలు చేశారు. అనంతరం ఉద్యానవనశాఖ అధికారి మాట్లాడుతూ వాణిజ్య పంటలకు దీటుగా ఉద్యాన పంటలను సాగు చేస్తే మంచి ఆదాయం లభిస్తుందని, ఈ పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. కూసుమంచి ఏడీఏ సరిత, ఏఓ వాణి, ఉద్యానవనశాఖ అధికారి అపర్ణ, ఏఈఓలు పాల్గొన్నారు.
మూతబడిన
డిగ్రీ, పీజీ కళాశాలలు
ఖమ్మం సహకారనగర్: డిగ్రీ, పీజీ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు మంగళవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. ఈ విషయమై కేయూలో నోటీసు ఇచ్చి బంద్ చేశామని యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, గుండాల కృష్ణ, కాటేపల్లి నవీన్‌బాబు వెల్లడించారు. గతంలోనూ కళాశాలల బంద్ చేపట్టగా ప్రభుత్వం ఇచ్చిన హామీతో తిరిగి తెరిచామని తెలిపారు. అయితే, బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో మళ్లీ బంద్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని, నిర్వహణ కూడా భారంగా మారిందని తెలిపారు. కాగా, డిగ్రీ విద్యార్థులకు మంగళవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కళాశాలల బంద్‌తో నిర్వహించలేకపోయామని యాజమాన్యాలు వెల్లడించాయి. దీంతో సమస్య పరిష్కారమై కళాశాలలు తెరిచాక పరీక్షలను రీషెడ్యూల్ చేసే అవకాశముందని సమాచారం.
నేత్రపర్వంగా
రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయస్వామి వారికి అభిషేకం. తమలపాకులతో అర్చన గావించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment