రూ.63.94 కోట్ల ఆదాయమే లక్ష్యం
● లైసెన్స్ లేని పత్తి వ్యాపారులకు నోటీసులు ● జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్
ఏన్కూరు/తల్లాడ: జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఈ ఏడాది రూ.63.94 కోట్ల ఆదాయం సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీమ్ తెలిపారు. ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌లో జూలూరుపాడు, ఏన్కూరు వ్యాపారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా డీఎంఓ మాట్లాడుతూ ఇప్పటి వరకు మార్కెట్ల ద్వారా వివిధ రూపాల్లో రూ 31.74 కోట్ల ఆదాయం సమకూరగా, మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. కాగా, పంటల కొనుగోలు విషయంలో వ్యాపారులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం 7–30 గంటలకల్లా జెండా పాట పూర్తిచేయాలని, రైతులకు నగదు ఏ రోజుకారోజు చెల్లించాలని సూచించారు. కాగా, తల్లాడలోని చెక్‌పోస్టును తనిఖీ చేసిన డీఎంఓ మాట్లాడారు. తల్లాడలో ముగ్గురు వ్యాపారులే లైసెన్స్ తీసుకుని పత్తి కొనుగోళ్లు చేపడుతుండగా, మిగతా వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. జిల్లాలోని తొమ్మిది సీసీఐ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 4 వేల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించిన రైతులకు నాలుగు రోజుల్లో డబ్బు జమ అవుతోందని తెలిపారు. ఈసమావేశాల్లో మార్కెట్ కార్యదర్శులు బి.బజారు, మోసీనా సుల్తానా, ఉద్యోగులు రామారావు, అనూష, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
ముదిగొండ: రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా ఆయన మాట్లాడగా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలోని సీసీఐ కొనుగోలు కేంద్రం నుంచి అధికారులు హాజరయ్యారు. ఈమేరకు పత్తి కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి పలువురు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిర్దేశిత శాతం తేమ నమోదు రాగానే పత్తి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీమ్, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు, మధిర ఏడీఏ విజయ్‌చంద్ర, ఏఓ వేణు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment