అర్హుల ఎంపికకే గ్రామసభలు
● ప్రతిపక్షాల నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోకండి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి: ప్రభుత్వం ఈనెల 26న నుంచి ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాలు అర్హులందరికీ దక్కుతాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అర్హులను గుర్తించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని మోటాపురం, కోరట్లగూడెం, కోనాయిగూడెం, పైనంపల్లి, అప్పలనరసింహాపురం, కొంగర, కట్టుకాచారం, బుద్ధారంలో బుధవారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సభల్లో మంత్రి మాట్లాడుతూ అర్హులను ఎంపిక చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాబితాలో పేర్లు లేని వారు అధైర్యపడవద్దని, మరోమారు దరఖాస్తులు స్వీకరించి అర్హత ఉంటే పథకాలు మంజూరు చేస్తామని చెప్పారు. అయితే, కొన్నిచోట్ల రెచ్చగొట్టే మాటలతో సభలకు ఆటంకం కలిగిస్తున్న వారిని నమ్మొద్దని సూచించారు. గత ప్రభుత్వం ఏనాడు కూడా గ్రామసభలు నిర్వహించలేదని.. తమ ప్రభుత్వం ఏ పైరవీ లేకుండా పథకాలు మంజూరు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఆర్‌డీఓ నరసింహారావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు స్వర్ణకుమారి, శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, భద్రయ్య, బొడ్డు బొందయ్య, రావెళ్ల కృష్ణారావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, బోయిన వేణు, పెంటమళ్ల పుల్లమ్మ, పాకనాటి సంగీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment