అర్హులందరికీ పథకాల లబ్ధి
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం అమలుచేసే నాలుగు సంక్షేమ పథకాల లబ్ధి అర్హులందరికీ దక్కేలా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వెల్లడించారు. ఖమ్మం 28వ డివిజన్ ప్రకాశ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశాక ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ప్రాథమికంగా జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గజ్జెల లక్ష్మి వెంకన్న, మునిసిపల్ ఏఈ బాబు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలతో నమ్మకం
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందిస్తూ వారిలో నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి తనిఖీ చేసిన ఆయన చికిత్స కోసం వచ్చిన వారు, సహాయకులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. వాహనాల పార్కింగ్, ఆస్పత్రి ప్రధాన గేట్ వద్ద రద్దీ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆస్పత్రికి కావాల్సిన పరికరాలు, సౌకర్యాలపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఆస్పత్రి నుంచి మెడికల్ కళాశాలకు ఓవర్ బ్రిడ్జి నిర్మానం కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, ఆర్‌ఎంఓలు రాథోడ్, బి.కిరణ్‌కుమార్‌తో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్ జి.పార్వతమ్మ పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్‌లోని బుధవారం అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ఏర్పాటుపై సూచనలు చేశారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు ఇచ్చేలా జాబితా రూపొందించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పేర్లు కూడా చేర్చాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీఓ నర్సింహారావు, కలెక్టరేట్ ఏఓ అరుణ పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment