● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్‌ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్‌లో చేరికలు ప్రభావం చూపేనా..? | Sakshi
Sakshi News home page

● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్‌ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్‌లో చేరికలు ప్రభావం చూపేనా..?

Published Wed, May 8 2024 12:40 AM

● ఎమ్

ఆదిలాబాద్‌ జిల్లాలో..

● అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామన్నపై గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయనే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని అధిష్టానం ఆలోచించినప్పటికీ చేరికల విషయంలో కాంగ్రెస్‌ అసమ్మతి నాయకులు సుజాత, సాజిద్‌ ఖాన్‌, సంజీవ్‌ రెడ్డిలకు భంగపాటు ఎదురైంది. అయినప్పటికీ తాజాగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం చేస్తామని వారు ప్రకటించారు. ఇక బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికల్లో అప్పటి మాదిరి ఓట్లను గడించాలని ఎమ్మెల్యే శంకర్‌ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాల్సిందే.

● బోథ్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా అనిల్‌ జాదవ్‌ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై గెలుపొందారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి ఆడే గజేందర్‌ మూడో స్థానంలో నిలిచారు. ఆయనే నియోజకవర్గ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. కాగా బీఆర్‌ఎస్‌కు చెందిన బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, డాక్టర్‌ వన్నెల అశోక్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ సభ్యుడు నరేశ్‌ జాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మంచి మెజార్టీ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

నిర్మల్‌ జిల్లాలో..

● నిర్మల్‌ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీహరిరావు ఇక్కడ మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం మాజీ మంత్రి ఐకే రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా హస్తం గూటికి చేరారు. కాగా బీజేపీలోకి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ శోభ సత్యనారాయణ గౌడ్‌ దంపతులు చేరారు. బీజేఎల్‌పీ నేతగా ఉన్న మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నాటి ప్రభావం ఈ నియోజకవర్గంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దీంతో ఆయన ప్రచారంలో వేగం పెంచారు.

● ముధోల్‌ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నారాయణరావు పటేల్‌ మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ ముథోల్‌ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. తన ప్రత్యర్థులంతా కాంగ్రెస్‌లో కలవడంతో ఇప్పుడు ఆయన ఈ ఎన్నికలను సవాలుగా తీసుకోవాల్సిన పరిస్థితి.

● ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భుక్యా జాన్సన్‌ నాయక్‌పై గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పైడిపల్లి రవీందర్‌రావు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఈ పార్లమెంట్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన ఏకై క నియోజకవర్గం ఇదే. దీంతో ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మంచి మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యే బొజ్జుపై ఉంది.

సాక్షి,ఆదిలాబాద్‌: పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో పార్టీ గెలుపు ఒక లెక్క అయితే.. తమ నియోజకవర్గంలో అభ్యర్థికి అత్యధిక ఓట్లు సాధించడం మరో లెక్క. ఎమ్మెల్యేలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఆదరించినట్టే ఇప్పుడు తమ పార్టీకి వెన్నంటి నిలుస్తారా.. లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆలోచన చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో చేరికలు పెరిగాయి. ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది.

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..

ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మి కాంగ్రెస్‌ అభ్యర్థి అజ్మీరా శ్యామ్‌నాయక్‌పై గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా మార్పులు చేర్పులు జరగలేదు. అయితే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సక్కుకు ఇక్కడినుంచి మంచి మెజార్టీ కల్పించిన పక్షంలో అది ఉపయుక్తంగా ఉంటుందనేది పార్టీ భావన. ఈ నేపథ్యంలో కోవ లక్ష్మి మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సిర్పూర్‌ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్పపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోనప్ప కాంగ్రెస్‌ లో చేరగా ఇక్కడ ఆ పార్టీ పటిష్టమైంది. బీఆర్‌ఎస్‌ మరో నేత అరిగెల నాగేశ్వర్‌రావు కూడా హస్తం గూటికి చేరారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు పార్టీ అభ్యర్థి నగేశ్‌కు మంచి మెజార్టీ సాధించేందుకు గట్టిగా కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌ ఎన్నికలు ●
1/1

● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌ ఎన్నికలు ●

 
Advertisement
 
Advertisement