భయం గుప్పిట్లో గ్రామాలు
● నాగాపూర్, చాందూర్ గ్రామాల్లో పెద్దపులి సంచారం ● ఎద్దుపై దాడితో భయాందోళనలో గ్రామస్తులు
ఉట్నూర్‌రూరల్/నార్నూర్: నిర్మల్ జిల్లాకేంద్రం నుంచి సంచరిస్తూ వస్తున్న పెద్దపులి శుక్రవారం పెంబి మండలంలో గేదె, దూడపై దాడి చేసింది. శనివారం పెంబి దోందరి, చిసిచెల్మ రేంజ్ పరిధిలోని వంకతుమ్మ ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసి గాయపర్చింది. అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నాగాపూర్‌లో ఆదివారం కనిపించింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన యువకులు పులిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని నీటి కాల్వలో పులి పాదముద్రలు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం చాందూర్ సమీపంలో రాజుల్‌గూడకు చెందిన కుమ్ర ఆనంద్‌కు చెందిన ఎద్దుపై దాడి చేసి గాయపర్చిందని స్థానికులు పేర్కొన్నారు. డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఉట్నూర్ ఎఫ్‌ఆర్వో శిలానంద్.. నాగాపూర్, చాందూర్ గ్రామాలను సందర్శించారు. పాదముద్రలను గుర్తించి పులిగా నిర్ధారించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులను అప్రమత్తం చేశారు. రెండు రోజులపాటు పంట పొలాలకు, బయటికి వెళ్లొద్దన్నారు. పొలాల వద్ద విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయొద్దన్నారు. ప్రస్తుతం పులి..నాగాపూర్, చాందూరి మీదుగా నార్నూర్ మండలం జామడ వైపుగా వెళ్లిందని అధికారులు నిర్ధారించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నార్నూర్, జైనూర్ మండలాల మీదుగా జోడేఘాట్ అడవులకు వెళ్లనుందని, అక్కడ ఆడపులి సంచరిస్తుందని అధికారులు పేర్కొన్నారు. పులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment