కొందరికే పరిహారం!
● జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో పంటనష్టం ● ప్రభుత్వ నిబంధనతో చాలామందికి అందని పరిహారం ● పలు మండలాల్లో ఆందోళనలు చేపట్టిన రైతులు
దహెగాం(సిర్పూర్): గడిచిన మూడేళ్లుగా జిల్లా రైతులను వరదలు వెంటాడుతున్నాయి. నది పరీ వాహక ప్రాంతాల్లోని పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాలతో పెద్దవాగు, ప్రాణహిత, పెన్‌గంగ, వార్దా నదులు ఉప్పొంగి పంటలు నీట మునిగాయి. ఐదు రోజులపాటు పంట లు వరద నీటిలోనే ఉండడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలతో నష్టపోయిన రైతులకు రాష్ట్రప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం మంజూరు చేసింది. 33 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా చాలామంది రైతులకు పరిహారం అందలేదు. నెలరోజులుగా వివిధ మండలాల్లోని బాధితులు ఆందోళనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించారు.
రూ.2.69 కోట్లు విడుదల
జిల్లావ్యాప్తంగా 4.23 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, మిరప తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా పత్తి 3.29 లక్షల ఎకరాలు ఉండగా.. వరి సుమారు 55 వేల ఎకరాల్లో ఉంది. ఆగస్టు చివరి వారం, సెప్టెంబరు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు నది పరీవాహక ప్రాంతాలతోపాటు చెరువులు, వాగుల సమీపంలోని పంట లు బ్యాక్ వాటర్‌తో రోజుల తరబడి నీటిలో ముని గిపోయాయి. జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం 2,692.11 ఎకరాలకు(1,374 మంది రైతులు) మా త్రమే రూ.2,69,22,750 పరిహారం మంజూరు చేసింది. పంటలు నష్టపోయిన వారి వివరాలను వ్యవసాయ శాఖ సర్వే చేసి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ప్రభుత్వం గత నెలలో నిధులు విడుదల చేయగా.. రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా 33 శాతం నష్టపోయిన పంటలను పరిగణనలోకి తీసుకోవడంతో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట మునిగింది
మొట్లగూడ శివారులో మూడెకరాల్లో పత్తి పంట వేశా. సెప్టెంబరు మొదటి వారం భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి మూడెకరాల పంట మొత్తం పూర్తిగా మునిగిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులు పరిహారం కోసం సర్వే చేసినా ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. వేల రూపాయల పెట్టుబడి వరద పాలైంది. పరిహారం అందించి ఆదుకోవాలి.
– ఒడిల వెంకటి, రైతు, మొట్లగూడ
పదెకరాల్లో నష్టం
వానాకాలంలో రావులపల్లి శివారులో 11 ఎకరాల్లో పత్తి పంట వేసిన. ప్రాణహిత నది వరదలకు పది ఎకరాల పత్తి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. సార్లు వచ్చి సర్వే చేసినా నయాపైసా కూడా పరిహారం రాలేదు. కొందరికి వచ్చినయి.. కొందరికి రాలేదు. ఇప్పటికీ పరిహారం కోసం సార్లను అడుగుతున్నా సమాధానం చెప్తలేరు.
– మామిడిపల్లి రాజన్న, రైతు
అన్నదాతల ఆందోళనలు..
ప్రాణహిత, పెద్దవాగు ఉప్పొంగడంతో సిర్పూర్(టి) నియోజకవర్గంలో సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం, బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో అధికంగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రాణహిత వరద తగ్గకపోవడంతో ఐదు రోజులపాటు నీట మునిగి ఉన్నాయి. పత్తి నీట మునగగా మరోసారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. చేలలో నిల్వచేసిన ఎరువుల బస్తాలు సైతం వరదకు కొట్టుకుపోయాయి. బెజ్జూర్ మండలంలో చాలా మందికి పరిహారం రాలేదని గత నెలలో రైతులు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. దహెగాం మండలం మొట్లగూడ, రావులపల్లి, రాంపూర్ గ్రామాల్లో ప్రాణహిత నది వరదలో నష్టపోయిన రైతులు కూడా కాగజ్‌నగర్ ఏడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతులు ఆందోళనలు చేసిన సమయంలో ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెబుతూ వ్యవసాయాధికారులు చేతులు దులుపుకొన్నారు. సర్వేను పకడ్బందీగా చేపట్టకపోవడంతో పూర్తిస్థాయిలో పరిహారం మంజూరు కాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment