మారని తీరు!
● పలు ప్రభుత్వ శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు ● ధనార్జనే ధ్యేయంగా లంచాలు డిమాండ్..! ● ఇటీవల జైనూర్‌లో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి ● ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 9 కేసులు నమోదు
వాంకిడి/తిర్యాణి: నిబంధనలకు తూట్లు పొడుస్తూ ధనార్జనే లక్ష్యంగా కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్న తీరు ప్రభుత్వ శాఖలకు చెరగని మచ్చగా మారుతోంది. ప్రతీ పనికి పైసాతో ముడి పెడుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకంగా సేవలందించాల్సిన వారు అడ్డదారులు తొక్కుతున్నారు. పైకం లేనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తోంది. ఓ వైపు ఏసీబీ అవినీతి అధికారులౖపై కొరడా ఝులిపిస్తున్నా మార్పు రావడం లేదు. నేరుగా కాకుండా ఏజెంట్లు, కిందిస్థాయి ఉద్యోగుల ద్వారా చాటుమాటున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రెడ్ హ్యాండెడ్ కేసులు నమోదయ్యాయి. ధనార్జనకు అలవాటు పడిన కొందరు అధికారులు ఏసీబీ వలలో చిక్కకుండా ఆస్తులు పోగేసుకుంటున్నారు.
ఆరోపణలు అనేకం..
ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏసీబీ అధికారులు చేపడుతున్న దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అద్దం పడుతున్నాయి. కొందరు అధికారులు రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ.. వారి అండతోనే రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుకు తరలిస్తున్నా.. దాడుల కు భయపడని అవినీతి అధికారులు జిల్లాలో రాజ్యమేలుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగం, వ్యవసాయ రంగం, అటవీ శాఖ, పోలీసు శాఖ, అక్రమ పట్టాలు, ఇసుక దందా, రుణాల మంజురు.. ఇలా పలు శాఖలపై ఆరో పణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ శాఖలో పర్సంటేజీ ల తీరుతో దందా సాగుతోంది. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే రహదారులు, భవనాల నిర్మాణాలు, తదితర పనుల్లో 10 నుంచి 20 శాతం వరకు కమిష న్లు మాట్లాడుకుంటున్నారు. ఆపై సదరు కాంట్రాక్ట ర్ తనకు నచ్చిన రీతిలో నిర్మాణాలు చేపట్టినా అధి కారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. అధి కార పార్టీ నాయకులకు సైతం కొంత పర్సంటేజీ ముట్టజెప్పుతున్నారు. పోలీసు శాఖలో భూపంచాయతీలు, అక్రమ రవాణా, ఫిర్యాదులు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఒకరిద్దరు కానిస్టేబుల్‌లే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. రవాణా శాఖలో అవినీతి ఏజెంట్ల చేతుల్లోనే అధికంగా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనం ఫిట్‌నెస్, తదితరల పనులు.. ఇలా ఏది కావాలన్నా ఏజెంట్‌ల ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి. ఇవే కాకుండా రెవెన్యూ, రిజిస్ట్రార్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు, సహకార సంఘాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది.
జిల్లాలో జరిగిన ఘటనలు
ఫర్టిలైజర్ దుకాణం రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసిన దహెగాం ఏవో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఐనంకు చెందిన మారుతి లైసెన్స్ రెన్యువల్ కోసం ఏవో వంశీకృష్ణ వద్దకు వెళ్లాడు. ఎరువుల లైసెన్స్ కోసం రూ.20 వేలు, విత్తనాల లైసెన్స్ కోసం రూ.18 వేలు డిమాండ్ చేయడంతో మారుతి ఏసీబీని ఆశ్రయించాడు. మే 27న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దహెగాం సహకార సంఘంలో జరిగిన అవినీతికి సీఈవో బక్కయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. 2021– 22లో సొసైటీ పరిధిలో రుణాల తారుమారు, ఎరువుల విక్రయాల్లో గోల్‌మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో రూ.61.50 లక్షల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. సీఈవో బక్కయ్యను సస్పెండ్ చేస్తూ డీసీవో రాథోడ్ బిక్కు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 2న జైనూర్ మండల కేంద్రంలో తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సీసీరోడ్డు పనులు చేసిన ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.12 వేలు డిమాండ్ చేయగా.. అతడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఏప్రిల్‌లో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25000 తీసుకుంటూ పట్టుబడ్డారు.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారి పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాల్లో ఏడుగురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆర్డీవో సిడాం దత్తుతో సహ డీటీ నాగోరావు, ఎంసీ భరత్, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు శంభుదాస్, లక్ష్మీనారాయణ గౌడ్, డ్రైవర్ తిరుపతి, కవల్కర్ తారాబాయిపై కేసు నమోదైంది.
గతేడాది నవంబర్‌లో చింతలమానెపల్లి ఎస్సై వెంకటేశ్ రూ.20000 నగదు తీసుకుంటూ పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment